calender_icon.png 21 January, 2026 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదు

21-01-2026 08:00:41 PM

కామారెడ్డిలో  రెండేళ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదు

మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): అధికార పార్టీలో సలహాదారుగా కొనసాగుతున్న షబ్బీర్ అలీ , ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి రెండేళ్ల కాలంలో కామారెడ్డిలో తట్టెడు మట్టి కూడా తీయలేదని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ శివారులో బుధవారం బృందావన్ గార్డెన్​లో బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్​ మాట్లాడుతూ.. రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణలో సంక్షేమ ఫలాలు అందాయని వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి  ఝూటా హామీలిచ్చారని, ఓట్లు వేయించుకుని గడ్డమీద కూర్చున్నారని విమర్శించారు. సీఎం స్థాయిలో ఉండి తెలంగాణ తెచ్చిన గులాబీ జెండా గద్దె కూల్చాలని చెబుతున్నారని, ఒక సీఎం మాట్లాడే మాటనేనా అని ప్రశ్నించారు. దమ్ముంటే జెండా గద్దెపై చేయి వేసి చూడాలని, తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తామని సవాల్ చేశారు. పదేళ్లలో తాము ఇదేవిధంగా ఆలోచిస్తే సీఎం ఎక్కడ ఉండేవాడని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ  జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వినాయక చవితి రోజు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, సీఎం వస్తే రూ. కోట్లు ఇచ్చి ఆదుకుంటారని ఆశించామన్నారు.

నాలుగు నెలలైనా ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఇక్కడి ప్రజలపై సీఎంకు ఉన్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు. 15 రోజులలో మీటింగ్ పెడతా అని పత్తా లేకుండా పోయారని విమర్శించారు. రూ.150 కోట్ల అభివృద్ధి ఎక్కడ..?, కామారెడ్డిలో గెలిచిన ఎమ్మెల్యే రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తానని గొప్పలు చెప్పారని, పుస్తకం కూడా ప్రింట్ చేసి పంచారని, రూ.150 కోట్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఐదేళ్లలో రెండేళ్లు పోయిందని, చిల్లిగవ్వ పని అయిందా అని మాజీ ఎమ్మెల్యే నిలదీశారు. అధికార పార్టీలో ఉన్న షబ్బీర్ అలీ ఎమ్మెల్యే కాదని, ఎమ్మెల్సీ కూడా కాదని, ఎమ్మెల్యే కాని ఎమ్మెల్యేగా బుగ్గ కారులో ఎస్కార్ట్ వేసుకుని తిరుగుతున్నారని గంప విమర్శించారు.

షబ్బీర్ అలీకి రెండేళ్లలో కామారెడ్డి గుర్తుకు రాలేదని, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని పోలీసులను వెంటేసుకుని సీసీ రోడ్లు, డ్రెయినేజీలకు కొబ్బరికాయలు కొడుతున్నారని తెలిపారు. సీఎం పక్క ఆఫీసులోనే ఉన్న ఆయన కామారెడ్డికి ఏం చేశారని ప్రశ్నించారు. పార్టీని నమ్ముకుంటే అవకాశాలు వస్తాయి మున్సిపల్ ఎన్నికల్లో  ప్రజల్లోకి వెళ్దామని, ఇంటింటికీ ప్రభుత్వ వైఫల్యాలు చేరవేద్దామని కార్యకర్తలకు గంప గోవర్ధన్​ పిలుపునిచ్చారు. మరోసారి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో పోటీకి అనేక మంది దరఖాస్తు చేస్తున్నారని, టికెట్ ఇచ్చేది ఒక్కరికేనని తెలిపారు. టికెట్ రాని వాళ్లు పార్టీకి ద్రోహం చేయవద్దని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది మనమేనని, పార్టీని నమ్ముకుంటే అవకాశాలు అవే వస్తాయన్నారు. ఈ 15 రోజులు పార్టీ కోసం కష్టపడదామని సూచించారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల మాదిరిగా కాదని, ప్రతి ఓటు ముఖ్యమేనని, ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలవాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.