నందిగామలో అరైవ్ అలైవ్ కార్యక్రమం
పాల్గొన్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
పటాన్‌చెరు, ఏప్రిల్ 15: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం మూడవ రోజు బుధవారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచే ఉద్దేశంతో వారం రోజుల పాటు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలపై అవగాహన తప్పనిసరి అని అన్నారు.
ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి, పరిమిత వేగంతో ప్రయాణించాలని సూచించారు. అతివేగం క్షణకాలం ఆనందాన్ని కలిగించినప్పటికీ, ప్రాణ నష్టానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదంలో కుటుంబ యజమానిని కోల్పోతే ఆ కుటుంబం ఎంతటి కష్టాల్లో పడుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు. గమ్యాన్ని చేరుకోవడం ఎంత ముఖ్యమో, దానిని సురక్షితంగా చేరుకోవడం అంతకంటే ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.ఎస్.సి జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, పటాన్చెర్వు డీఎస్పీ ప్రభాకర్, భానూర్ ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మెన్ శివానందం, నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, విధ గ్రామాల సర్పంచులు, డ్వాక్రా సంఘాల మహిళలు, పరిశ్రమల ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






