calender_icon.png 8 November, 2024 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టిజన్స్‌ను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి

16-09-2024 04:13:28 AM

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ నాయకుల డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 15 (విజయక్రాంతి): తెలంగాణ విద్యుత్ సంస్థలో 23 వేలకు పైగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వాలు ఇన్నేళ్లు ఆర్టిజన్ అనే పేరుతో మోసం చేశాయని.. తక్షణమే ఆర్టిజన్స్ అందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ చైర్మన్ కె.ఈశ్వర్ రావు, కన్వీనర్ ఏంఏ వజీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు తెలంగాణలోని అన్ని విద్యుత్ కార్మిక సంఘాలు అన్నీ కలిసి ఇటీవల ‘తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ’ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన సభలో పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. జేఏసీ చైర్మన్ ఈశ్వర్ రావు మాట్లాడుతూ.. ఆర్టిజన్స్ వ్యవస్థను ఇలాగే కొనసాగిస్తూ ప్రభుత్వం జేఏల్‌ఎం, జూనియర్ అసిస్టెంట్స్ తదితర పోస్టులను రిక్రూట్ చేస్తోందన్నారు.

దీంతో ఆర్టిజన్స్ ఉద్యోగ విరమణ దాకా ఆర్టిజన్స్ పోస్టులోనే కొనసాగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ కోకన్వీనర్ జి.నాగరాజు మాట్లాడుతూ.. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో పర్మినెంట్ ఉద్యోగులు చేసే పనిని ఆర్టిజన్ కార్మికులు కూడా చేస్తున్నారని అన్నారు. అయినప్పటికీ తమను అంటరాని వారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోచైర్మన్లు శంకర్, నరేందర్, కన్వీనర్ అరవింద్ కుమార్, చంద్రారెడ్డి, లింగం, కృష్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు.