సత్యం కోసం పోరాడే అరుణ
‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అనన్య నాగళ్ల సహజ నటనతో అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. పవన్‌కళ్యాణ్, రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించడం ఈ బ్యూటీ కెరీర్‌కు కలిసివచ్చింది. ప్రస్తుతం విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అనన్య నటిస్తున్న సస్పెన్స్ డ్రామా ‘ది బ్రేకింగ్ న్యూస్’ నుంచి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది.
మీడియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనన్య నాగళ్ల ‘అరుణ’ అనే ఒక తీవ్రమైన, ఉద్వేగభరితమైన పాత్రను పోషిస్తోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా టీమ్ విడుదలైన పోస్టర్‌లో అనన్య లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె.. న్యూస్ ఛాన ల్ మైక్‌ను పోలి ఉన్న పంజరంలో బందీగా ఉండటం కథలో ని తీవ్రతను సూచిస్తోంది. అనన్య ఈ సినిమాలో వ్యవస్థలో చిక్కుకున్నా, అడ్డంకులను ఛేదించి సత్యాన్ని బయటపెట్టే ఒక జర్నలిస్టుగా కనిపించనుందని అర్థమవుతోంది.
ఇక మేకర్స్ ఈ పోస్టర్‌కు జోడించిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. ‘సత్యం బంధించబడినప్పుడు.. దాన్ని విముక్తం చేసేదెవరు? కొన్ని గొంతులు అణచివేయబడవచ్చు.. కానీ ఆమె గొంతు సత్యాన్నే కదిలించివేస్తుంది’ అంటూ రాసుకొచ్చారు. అరుణ అనే పాత్ర సమాజంలోని కుట్రలను, అబద్ధాలను ఎలా ఎదుర్కొంటుందనేది ఈ సినిమాలో ప్రధానాంశంగా ఉండబోతోంది.
దర్శకుడు పవన్ కడియాల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను హనుమంత్‌రెడ్డి, ఉమ గుటూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు మురళీమోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనన్య మిగతా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘సంబరాల ఏటిగట్టు’, ‘లీసా’ వంటి సినిమాలతోపాటు హిందీ ప్రాజెక్టుల్లోనూ భాగమైంది.






