4 May, 2026 | 1:50 AM

గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం

04-05-2026 12:30 AM

హీరో టి.గోపీచంద్ ప్రతిష్టాత్మక చిత్రం ’గోపీచంద్34’ ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బలమైన కథాంశాలతో కూడిన చిత్రాలను అందించడంలో పేరుపొందిన ’70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్’ బ్యాన్ప, విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ నటి అనార్కలి నజర్ను ఎంపిక చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా ఆమె తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు.

ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం పూజా కార్యక్రమాలతో జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ముహూర్త కార్యక్రమంలో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, రవిశంకర్ స్క్రిప్ట్ను అందజేశారు. యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఫస్ట్‌క్లాప్ కొట్టారు. నిర్మాత దిల్ రాజు ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో గోపీచంద్ పూర్తి యాక్షన్ అవతార్లో, ఇంటెన్స్ డ్రామా, ఎమోషన్స్ కూడిన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: షామ్దత్ ఐసీఎస్; సంగీతం: సామ్ సీఎస్; ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ-మోనిక; నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి; రచన, దర్శకత్వం: వీ వెంకట్.