12-12-2024 12:00:00 AM
బహు భాషా- సంస్కృతులతో గంగా జమునా తెహజీబ్‌గా వర్ధిల్లుతూ, వలసవాద వ్యతిరేక పోరాటాలకు, మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సాక్షీభూతంగా నిలిచిన హైదరాబాద్‌లోనే ‘అరుణోదయ’ సాంస్కృతిక సంస్థ పురుడు పోసుకుని 50 వసంతాలు పూర్తవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విప్లవ విద్యార్థి ఉద్యమ నాయకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి వారసుడైన అమరుడు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో ‘అరుణోదయ’ 1974 మే 12న లాంఛనంగా ఏర్పడింది. 1974లో స్థాపితమైన సంస్థ సిరిసిల్ల-, జగిత్యాల రైతాంగ పోరాటాలతో, ఆదివాసీ స్వయంపాలన, స్త్రీల సమాన హక్కులు, కార్మికవర్గ సమ్మెలతోపాటు విప్లవ విద్యార్థి ఉద్యమాలతోనూ పెనవేసుకుని కొనసాగుతూనే ఉంది. సంస్థ నిర్మాణం చిన్నదైనా దశాబ్దాల తరబడి ప్రజలతో, ప్రజా ఉద్యమాలతో మమేకమైంది.
అరుణోదయ సృష్టించిన ప్రభావం అపార మైంది. ప్రాంతీయ ప్రజాస్వామ్య పోరాటంగా గుర్తించి తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో గొప్ప పాత్ర నిర్వహించింది. ప్రజా సాంస్కృతికోద్యమంగా బహుజన బతుకమ్మను తలకెత్తుకుంది. అయితే, అన్ని సంఘాల మాదిరిగానే అరుణోదయలోనూ చీలిక వచ్చింది. అప్పటి నుంచి ఐక్యతకోసం పోరాటం సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 14-15 తేదీల్లో హైదరాబాద్‌లో 50 వసంతాల సభలు జరపడానికి నిశ్చయించారు. ఈ సందర్భంగా అన్ని సంస్థల ఐక్యతకై మరొక తీర్మానం ఆమోదించి, విప్లవ సాంస్కృతిక సంఘాల సమష్టి స్పందనను కోరనుంది.
ఈ సభలో ఆయా సంఘాల అభిప్రాయాలు, సౌహార్ద్ర సందేశాల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవాలని ఆశిస్తున్నారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగే ప్రతినిధుల సభకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ జ్ఞాన అలోషియస్ హాజరవుతారు. సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్ ప్రారంభోపన్యాసం చేస్తారు. వివిధ అంశాలపై జరిగే చర్చల్లో భాగస్వామ్యం కావాలని సోదర సంస్థలకు, విప్లవ -ప్రజాతంత్ర వాదులకు, కవులు, కళాకారులందరికీ సంస్థ నిర్వాహకులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.