calender_icon.png 5 July, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిక్కుల్లో హైకోర్టు జడ్జి

12-12-2024 12:00:00 AM

విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అంతేకాదు, దేశంలో మత సామరస్యం, స్త్రీ, పురుష సమానత్వం, సెక్యులరిజం పెంపొందించడం కోసం ఉమ్మడి పౌరస్మృతి అవసరమని కూడా ఆయన వ్యాఖ్యానించారంటూ వార్తలు వచ్చాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఒక మతానికి అనుకూలంగా మాట్లాడడమే కాకుండా, మరో మతాన్ని కించపరిచే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను పదవినుంచి తొలగించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

యాదవ్‌ను అభిశంసించడం ద్వారా పదవినుంచి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు,  రాజ్యసభ స్వతంత్ర సభ్యుడు కపిల్ సిబల్, మరో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సీపీఎం నాయకురాలు బృందాకారత్ తదితరులు   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టును నివేదిక కోరింది. మరోవైపు యాదవ్‌ను అభిశంసించాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్ట డానికి రాజ్యసభలో ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు సిద్ధమవుతున్నా యి. 

అయితే అభిశంసన తీర్మానాన్ని సమర్పించాలంటే రాజ్యసభలో కనీ సం 50 మంది ఎంపీలు దానిపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 36 మంది ఎంపీలు సంతకాలు చేశారని, మిగతా సభ్యుల సంతకాలు కూడ సేకరించిన తర్వాత గురువారం అభిశంసన తీర్మానాన్ని సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజ్యసభలో ఇండియా కూటమికి 85 మంది సభ్యులున్నారు. లోక్‌సభలో కూడా ఇలాంటి తీర్మానాన్నే ప్రతిపాదించడానికి విపక్షాలు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఒక న్యాయమూర్తిని అభిశంసించాలంటే అంత సులువు కాదు. దీనికి బోలెడు తతంగం ఉంది.

1968 నాటి జడ్జీల దర్యాప్తు చట్టం ప్రకారం ఒక న్యాయమూర్తి అభిశంసనకోసం సమర్పించే తీర్మానంపై లోక్‌సభలో అయితే కనీసం వంద మంది, రాజ్యసభలో అయితే 50 మంది ఎంపీలు సంతకాలు చేయాలి. తీర్మానం సమర్పించిన తర్వాత దాన్ని అంగీకరించాలా లేదా అనేది సభ ప్రిసైడింగ్ అధికారి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది.

ఒక వేళ అంగీకరిస్తే ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి, అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అది తగినదేనా కాదా అని నిర్ణయించడానికి ఇద్దరు న్యాయమూర్తులు, ఒక న్యాయకోవిదుడితో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారు. రాజ్యాగంలోని 124(4) అధికరణం ప్రకారం అభిశంసన తీర్మానం ఆమోదం పొందాలంటే సభలోని మొత్తం సభ్యుల్లో మెజా రిటీ సభ్యులు, అలాగే లోక్‌సభతో పాటుగా రాజ్యసభలో హాజరయిన సభ్యుల్లో మూడింట రెండువంతుల మంది దాన్ని సమర్థించాలి. అయితే పార్లమెంటు ఉభయ సభల్లోను ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందే అవకాశాలు లేవు.

మరోవైపు ఇప్పటివరకు దేశ చరిత్రలో ఆరుగురు న్యాయమూర్తుల అభిశంసనకు ప్రయత్నాలు జరిగాయి. వీరిలో నలుగురు హైకోర్టు జడ్జీలు కాగా ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. 2018లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై కూడా ఇలాంటి ప్రయత్నమే జరిగింది. అయితే ఈ అభిశంసన తీర్మానాల్లో ఏదీ కూడా ఆమోదం పొం దడం కానీ, అమలుకావడం కానీ జరక్క పోవడం విశేషం.

అభిశంసన తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదని స్పష్టంగా తెలిసినా ప్రతిపక్షాలు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అభిశంసనకు ఎందుకు పట్టు బడుతున్నాయి? అన్న ప్రశ్న తలెత్తవచ్చు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం తో పాటుగా భవిష్యత్తులో న్యాయవ్యవస్థకు చెందిన వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చూడడానికి ఇది దోహదపడవచ్చు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇప్పటివరకు బీజేపీ కానీ, యాదవ్ కానీ ఎలాంటి స్పష్టతా ఇవ్వకపోవడం గమనార్హం.