calender_icon.png 5 July, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ తప్పా?

11-12-2024 12:00:00 AM

మనుషుల విశాల దృక్పథాలు వారిమాటల్లో కంటే ఆచరణలో చూపించినపుడే మనం ఆయా మనుషులను గౌరవంతో చూస్తాం. ఐతే వ్యక్తులుగా వారి విశాల దృక్పథం కలిగిన ఆలోచనలను సమస్య బయటనుండి పరిశీలించి మాట్లాడినంత సులభం కాదు.

వారు కూడా ఆ సమస్య తలెత్తిన సందర్భంలో ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారంలో భాగం కావాల్సి వచ్చినపుడు వారు న్యాయం వైపు నిలబడ్డప్పుడు మాత్రమే వారి విశాలత్వం ప్రదర్శించబడుతుంది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన తరువాత మాట్లాడుతున్న కొంతమంది మేధావులను చూస్తే అది నిజమేననిపిస్తుంది.

ఇప్పుడు వర్గీకరణను వ్యతిరేకిస్తున్న చాలామంది మాల మేధావులు, ఇతరులు చాలామంది కూడా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ప్రారంభమై ,తీవ్ర రూపం తీసుకున్న తరువాత దాన్ని స్వాగతించిన, సమర్థించిన వారే. ఐతే ఇప్పుడు వారు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆ రోజుల్లో ఎస్సీ వర్గీకరణ పట్ల స్పష్టమైన సామాజిక ఆమోదం, కోర్టు తీర్పు లేదు కాబట్టి  ముసుగులు తొడిగి మాట్లాడారేమో అనిపిస్తుంది. 

 సమాన వాటా అవసరం 

సుప్రీంకోర్టు వర్గీకరణ తరువాత జరుగుతున్న చర్చల్లో అసలు ఆ వర్గీకరణ ఎందుకు, ఎట్లా అన్యాయమైనదో చెప్పకుండా దాన్ని జరుగనీయం, అడ్డుకుంటాం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ అసంబద్ధ  వాదనలు చేస్తున్నారు. ఏ కాలానికైనా న్యాయంగా సమ పంపిణీ చేసుకో వడమే ప్రజాస్వామిక విలువ.

దీన్ని గుర్తించకుండా ఊరికే వ్యతిరేకిస్తే మేధావులుగా చెలామణి అయ్యేవారు కూడా పలుచనవ్వక తప్పదు. నిజానికి దాని వల్ల అన్యా యానికి గురైన వర్గం ఉంటే దాన్ని బాహ్య ప్రపంచం ముందు ఉంచి వారి వాదనలతో సామాజిక మద్దతు కూడగట్టి, ఎదు టి పక్షాలకు దానివల్ల జరుగుతున్న అన్యాయాలను వివరించి ఒప్పిస్తే శాశ్వత పరి ష్కారం దక్కుతుంది. 

ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వాళ్లు ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. సామాజిక న్యాయ సాధనలో భాగంగా విద్య,రాజకీయ రంగాలలో ఆయా వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేష న్లు ఉండాలా? వద్దా? దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే క్రమంలో ఎవరి వాటాలు వారు పొందడం న్యాయమైన హక్కా? కాదా?.

మొత్తంగానే బహుజనుల రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీగా వర్గీకరణ న్యాయ సమ్మతమైనదేనా? వీటన్నిటిని గనుక సామాజిక న్యాయ కాంక్షితు లుగా సానుకూల స్పందనలు తెలియజేస్తే మరి ఎస్సీ వర్గీకరణను మాత్రమే ఎందు కు వ్యతిరేకిస్తున్నారు?

 చట్టం కోసం పట్టుబట్టాలి

ఇటీవల వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న వారందరుకూడా మాలలకు లేదా ఇతరులకు ఏదైనా నష్టం జరు గుతుందా అనే విషయాన్ని ప్రస్తావించకుండా ప్రధానంగా రెండే రెండు విషయా లను వల్లె వేస్తున్నారు. అవేమిటంటే ఒకటి ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఆ తీర్పు ఉన్నదని. రెండవది ఐక్యత దెబ్బతింటుందని. ముందుగా మొదటి  విషయాన్ని పరిశీలిస్తే అసలు ఆ 341 వ ఆర్టికల్ వర్గీకరణకు ఎటువంటి ఆటంకం కాదు.

ఒకవేళ అది ఆటంకం అనుకుంటే విశాల ప్రజాస్వామిక ఆలోచనలు ఉన్నవాళ్లు, సమాజ శ్రేయస్సు కాంక్షిస్తున్నామని చెప్పేవాళ్ళు, సామాజిక న్యాయానికి అడ్డంకులుగా ఏమైనా ఉంటే వాటిని తొలగించి సత్వరమే న్యాయం చెయ్యాలని డిమాండ్ చెయ్యాలి కానీ అడ్డంకులు ఉన్నాయి కాబట్టి చెయ్యొద్దు అనడం న్యాయమా?.

రాజ్యాంగంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజా శ్రేణులకు దక్కాల్సిన న్యాయమైన హక్కులను దక్కకుండా చెయ్యడానికి రాజ్యాంగంలోనే ఉన్న కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకుని ఆపుతున్నపుడు అటువంటి వాటిని సవరించాలని, అవసరమైతే తొలగించాలని మాట్లాడటం లేదా? మరి వర్గీకరణ విష యం వచ్చేసరికి ఆ మాట ఎందుకు అన టం లేదు.

పార్లమెంటులో బిల్లు చేస్తేనే అది చెల్లుబాటు అవుతుందని అంటున్నవారు దీన్ని పార్లమెంటులో బిల్లు పెట్ట్టి వర్గీకరణ చెయ్యమని అడిగి ఉంటే సామాజిక న్యాయాన్ని కోరేవారుగా చూడవచ్చు.  నిజానికి మాల మేధావులు వర్గీకరణ కోసం పార్లమెంటులో చట్టం చెయ్యడానికి పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి.

దీనికి బాలగోపాల్ గారు ఎప్పుడో సూచన చేసినట్టుగా, 341  ఆర్టికల్‌కు  వర్గీకరణ చట్టబ ద్ధమైనదే అనేటువంటి మూడవ క్లాస్ జోడిస్తూ సవరణ చేసి చట్టం చేస్తే సరిపోతుందన్న దాన్ని డిమాండ్‌గా పెట్టాలి. లేదా వర్గీకరణ వల్ల మాలలకే అన్యాయం జరుగుతుంది , మాలల జనాభా ఎక్కువ ఉన్నదని అనుకుంటే మా జనాభా ప్రకా రం మాకు వాటా కల్పించాలని కూడా పార్లమెంటు ముందు ఆధారాలు పెట్టి వారి న్యాయమైన వాటా కోసం కొట్లాడితే అర్థం ఉంటుంది.

కానీ అసలు పంచనే వద్ద ని అనడం వెనుక ఏమైనా వంచన ఉందా అని అవతలి పక్షం అనుమాన పడాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. 

రాజ్యాధికారంలో వాటాకూ..

 మాలల నాయకులు, మాల మేధావులు పెట్టే రెండో వాదన కూడా అసంబ ద్ధంగానే అనిపిస్తుంది. నిజంగా వర్గీకరణ వల్ల ఐక్యత దెబ్బతింటుంది అంటే సమ న్యాయానికి, సమాన అవకాశాలకు దూరమవుతున్న సమాజం ఇంకా ఈ ఐక్యత పేరుమీద నష్టపోవాల్సిందేనా? అనే ప్రశ్న కు ఏం సమాధానం చెబుతారు?.

వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్న రోజుల్లో కూడా ’వర్గమే ముందు, తరువాత కులం’ అని కులాన్ని,దాని వల్ల కలుగు నష్టాలను విస్మరించడం మూలంగానే బహుజనులు, దళితులు వామపక్ష ఉద్యమాలకు దూరం కావడానికి ఒక ముఖ్య కారణం. ఇప్పుడు కూడా ఐక్యత పేరుతో మాల నాయకులు  అటువంటి రీతిగానే ప్రవర్తిస్తే ఈ మాత్రం ఐక్యత, సుహృద్భావ పరిస్థితులు మరింత అనైక్యతకు దారితీస్తుందని మరిచిపోరాదు.

మాల మేధావుల తాపత్రయం అంతా ఐక్యత  కోసమే ఐతే... వర్గీకరణను అడ్డుకోవడం కాకుండా పంచుకోవడం మా సోదరుల మధ్య సమస్య, దీన్ని మేమే పరిష్కరించుకుంటామని చెప్పాలి. కేవలం కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లో సీట్లు ఇవ్వడమే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేబినెట్లల్లో కూడా మేమెంతో మాకంత  అని మా వాటా ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలని ఉమ్మడిగా డిమాండ్ చెయ్యాలి.

రాజ్యాధికారం బహుజనుల నాయకత్వంలోనే ఉండాలని చెప్పి పీడిత బహుజన కులాలను అందరినీ పోగేసి బహుజన రాజ్యాధికార ఉద్యమానికి నాయకత్వం వహించాలి.

మరీ ముఖ్యంగా ఈ దేశంలో రాజకీయ గుత్తాధిపత్యం మాత్రమే కాదు ఆ రాజకీయాలను శాసిస్తున్న వనరుల గుత్తాధిపత్యం కూడా కొనసాగుతోంది. నిజానికి దళితుల ఐక్యతను ప్రదర్శించడానికి రాజ్యాంగంలోనే పొందుపరిచినటువంటి ఆర్టికల్ 39 ప్రకారం సంపద లేదా సహజవనరుల సమానమైన పంపిణీ అనే నినా దంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆ వనరులపై ఆధిపత్యాన్ని పొందగలిగితే రిజర్వేషన్ల వల్ల కలిగే ప్రయోజనాలకు రెట్టింపు ప్రయోజనాలు ఈ సమాజం పొందగలదు.

ఈ వనరులపై ఆధిపత్యం ద్వారా రాజకీయ సాధికారతను కూడా పొందగలిగే అవకాశం ఉన్నదనే విషయాన్ని దళిత మేధావులు గమనించాలి.

కాబట్టి ఇప్పటికైనా నిజంగా సామాజిక న్యాయాన్ని, దళితుల ఐక్యతను, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయేవారుగా మాలమేధావులు తమను తాము భావిస్తే వర్గీకరణను అడ్డుకోవడం కాకుండా ఆ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరుగుతుందని భావిస్తే దాన్ని సరిచేయడానికి అందుకు అవసరమైన న్యాయమైన డిమాండ్‌ను సమాజం ముందు ఉంచి దాన్ని సాధించుకునేందు కు కృషి చెయ్యాలి.

ఈ వర్గీకరణ అనుకూ ల, వ్యతిరేక ఉద్యమాలు ఇప్పటికే నిర్మితమైన దళిత చైతన్య స్ఫూర్తిని నీరుగారు స్తు న్నాయి. మన కొట్లాటను అనైక్యత బూచి గా చూపిస్తూ పాలకులు తాత్సారం చేస్తూ వారి ప్రయోజనాలు నెరవేర్చుకునే ఎత్తుగడలు రచిస్తున్నారు. వాటిని చిత్తు చెయ్య డం కోసం కూడా దళితులలో ఉన్న అన్ని వర్గాల మేధావులు అందరికీ సమాన అవకాశాలు, సమాన న్యాయం దక్కేలా ప్రతి పాదనలతో ముందుకు సాగాలి.

వ్యాసకర్త సెల్: 8464030808