23 April, 2026 | 6:18 AM

జాతీయ రహదారిగా.. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణం

27-06-2024 01:09 AM

హైదరాబాద్- -విజయవాడ హైవేను ఆరు లేన్లుగా విస్తరించాలి.. 

  1. పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారి పనులు ప్రారంభించండి
  2. 16 రాష్ట్ర రహదారులను నేషనల్ హైవేలుగా గుర్తించండి 
  3. సోమశిల ఐకానిక్ బ్రిడ్జి పనులు వెంటనే చేపట్టండి
  4. మంథనికి జాతీయ రహదారిని ప్రకటించండి 
  5. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 2౬ (విజయక్రాంతి): ప్రాంతీయ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, హైదరాబాద్--విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో గడ్కరీతో సీఎం బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో జాతీయ రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారుల ప్రకటన, ఇప్పటికే జాతీయ రహదారులుగా ప్రకటించిన మార్గాల పనుల ప్రారంభం తదితర విషయాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

సంగారెడ్డి నుంచి నర్సాపూర్-, తూప్రాన్, -గజ్వేల్, -జగదేవ్‌పూర్, -భువనగిరి, -చౌటుప్పల్ (158.645 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారని, దాని భూ సేకరణకు అయ్యే వ్యయంలో సగ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. ఈ భాగంలో తమ వంతు పనులు వేగవంతం చేశామని తెలిపారు. చౌటుప్పల్ నుంచి ఆమన్‌గల్, -షాద్‌నగర్, -సంగారెడ్డి వరకు (181.87 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి, ఈ ఏడాది ఎన్‌హెచ్‌ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ (ఓఆర్‌ఆర్ గౌరెల్లి జంక్షన్) నుంచి వలిగొండ, -తొర్రూరు, -నెల్లికుదురు-, మహబూబాబాద్-, ఇల్లెందు,- కొత్తగూడెం వరకు రహదారిని (ఎన్‌హెచ్ 930పీ) జాతీయ రహదారిగా ప్రకటించారని, ఇందులో కేవలం ఒక ప్యాకేజీ కింద 69 కిలోమీటర్లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ వాసులు భద్రాచలం వెళ్లేందుకు 40 కిలోమీటర్ల దూరం తగ్గించే ఈ రహదారిని జై శ్రీరామ్ రోడ్‌గా వరంగల్ సభలో నితిన్ గడ్కరీ చెప్పిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఈ రహదారిలో మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కిలోమీటర్లు) టెండర్లు పిలిచినందున వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు. 

ఏపీ, తెలంగాణ రాజధానుల మధ్య..

హైదరాబాద్- విజయవాడ (ఎన్‌హెచ్ 65) జాతీయ రహదారిని 2024, ఏప్రిల్‌లోగా ఆరు లేన్లుగా విస్తరించాల్సి ఉందని నితిన్ గడ్కరీ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలకమైన ఈ రహదారిలో రోజుకు 60 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, రద్దీ పెరగటంతో ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ రాష్ర్ట విభజనతో వాహన రద్దీ తగ్గిందని, తమకు సరైన ఆదాయం రావడం లేదంటూ కాంట్రాక్ట్ సంస్థ 6 వరుసల పనులు చేపట్టడం లేదని కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఎన్‌హెచ్‌ఏఐ, కాంట్రాక్ట్ సంస్థ మధ్య వివాదాన్ని పరిష్కరించి త్వరగా 6 వరుసలుగా రహదారి విస్తరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 

సోమశిల ఐకానిక్ బ్రిడ్జి.. 

ఎలివేటెడ్ కారిడార్ 

కల్వకుర్తి నుంచి కొల్లాపూర్, -సోమశిల, -కరివెన, -నంద్యాల (ఎన్‌హెచ్ 167కే) మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి 142 కిలోమీటర్ల పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని గడ్కరీకి సీఎం తెలిపారు. మిగిలిన 32 కిలోమీటర్ల పనులకు, సోమశిల వద్ద ఐకానిక్ బ్రిడ్జికి టెండర్లు పిలిచారని, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ వాసులు తిరుపతి వెళ్లేందుకు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. కల్వకురిొ్త -నంద్యాల రహదారి (ఎన్‌హెచ్ -167కే) హైదరాబాద్- శ్రీశైలం మార్గంలో ఉన్న రహదారిలో (ఎన్‌హెచ్‌శు 765కే) 67 కిలోమీటర్ వద్ద (కల్వకుర్తి) ప్రారంభమవుతుందని, ఎన్‌హెచ్ 167కే జాతీయ రహదారి పనులు చేపట్టినందున, హైదరాబాద్- కల్వకుర్తి వరకు ఉన్న (ఎన్‌హెచ్ 765కే) రహదారిని రెండు వరుసల నుంచి నాలుగు వరుసలుగా విస్తరించాలని కోరారు.

కల్వకుర్తి వరకు జాతీయ రహదారి పూర్తయ్యే లోపు హైదరాబాద్- కల్వకుర్తి రహదారిని నాలుగు వరుసలుగా విస్తరణకు అనుమతులు ఇవ్వాలని విన్నవించారు. హైదరాబాద్- శ్రీశైలం (ఎన్‌హెచ్‌ే 765) మార్గంలో 62 కిలోమీటర్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉందని, అటవీ అనుమతులు లేక అక్కడ పనులు చేపట్టలేదని చెప్పారు. ఈ మార్గంలో నిత్యం ఏడువేలకుపైగా వాహన రాకపోకలు సాగిస్తాయని, పుణ్యక్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారని, ఈ నేపథ్యంలో అమ్రాబాద్ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతులు మంజూరు చేయాలని కోరారు.  

మంథనికి జాతీయ రహదారి ప్రకటించండి

మంథని నుంచి సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ అసెంబ్లీ స్పీకర్ శ్రీపాదరావు గతంలో ప్రాతినిధ్యం వహించిన ఈ ప్రాంతానికి ఇప్పటివరకు జాతీయ రహదారుల చిత్రంలో చోటు దక్కలేదని సీఎం తెలిపారు. జగిత్యాల,-పెద్దపల్లి,- మంథని,- కాటారం రాష్ర్ట రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ రహదారి పూర్తయితే ఎన్‌హె-చ్ 565, ఎన్‌హెచ్ -353సీ అనుసంధానమవుతాయని తెలిపారు. తెలంగాణ, మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు అనువుగా ఉంటుందని, దక్షిణ కాశీగా గుర్తింపుపొందిన కాళేశ్వరం క్షేత్రానికి అనుసంధానత పెరుగుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. 

కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఇతర అంశాలు

తెలంగాణను కర్ణాటక, మహారాష్ర్టతో అనుసంధానించే హైదరాబాద్- మన్నెగూడ రోడ్డును నాలుగు వరుసల జాతీయ రహదారిగా (ఎన్‌హెచ్ ప్రకటించడంతో భూ సేకరణ పూర్తి చేశామని, టెండర్లు పిలవడం పూర్తయినా ఎన్జీటీలో కేసు వలన పనులు ప్రారంభం కాలేదని సీఎం రేవంంత్ రెడ్డి తెలిపారు. ఆ మార్గంలో ఉన్న మర్రి చెట్లను కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనల ప్రకారం ట్రాన్స్‌లోకేషన్ చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అంగీకరించిందని చెప్పారు. ఈ దశలో ఎలైన్‌మెంట్ మార్చడం సాధ్యం కాదని, సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఈ మార్గం పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. సేతు బంధన్ స్కీం కింద 2023 -24లో రాష్ర్ట ప్రభుత్వం సమర్పించిన 12 ఆర్వోబీలు/ఆర్‌యూబీలను వెంటనే మంజూరు చేయాలని విన్నవించారు. 

16 రాష్ట్ర రహదారులను హైవేలుగా మార్చండి

జగిత్యాల (130 కి.మీ.), దిండి- నల్లగొండ (100 కి.మీ.), భువనగిరి- చిట్యాల (44 కి.మీ), చౌటుప్పల్- సంగారెడ్డి (182 కి.మీ), మరికల్- రామసముద్రం (63 కి.మీ.), వనపర్తి -మంత్రాలయం (110 కి.మీ.), మన్నెగూడ- బీదర్ (134 కి.మీ.), కరీంనగర్- పిట్లం (165 కి.మీ.), ఎర్రవెల్లి క్రాస్ రోడ్- రాయచూర్ (67 కి.మీ.), కొత్తపల్లి- దుద్దెడ (75 కి.మీ.), సారపాక- ఏటూరు నాగారం (93 కి.మీ.), దుద్దెడ- రాయగిరి క్రాస్ రోడ్ (63 కి.మీ.), జగ్గయ్యపేట- కొత్తగూడెం (100 కి.మీ.), సిరిసిల్ల- కోరుట్ల (65 కి.మీ.), భూత్పూర్- సిరిగిరిపాడు (166 కి.మీ.), కరీంనగర్- రాయపట్నం (60 కి.మీ.) కలిపి మొత్తం 1,617 కిలోమీటర్ల రహదారులను అప్‌గ్రేడ్ చేయాలని సీఎం కోరారు.