02-10-2025 02:11:40 AM
చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అనేది ట్యాగ్‌లైన్. మెగాస్టార్ నటిస్తున్న 157వ చిత్రమిది. దీన్ని షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో అలరించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కేరళలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేశారు. ఇప్పుడు ఓ ప్రత్యేక సెట్‌లో పాటలు చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్ 5 నుంచి వెంకటేశ్ ఈ షూటింగ్‌లో పాల్గొననున్నారు.
తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ అనిల్ ఓ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఈ సినిమాలో నయనతార పాత్ర పేరును వెల్లడించారు. ‘నయనతారతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆమె తన పాత్రతో సినిమాకు మరింత అందాన్ని తెచ్చారు. ఈ సినిమాలో నయన్ ‘శశిరేఖ’ పాత్రలో నటిస్తున్నారు. దసరా సందర్భంగా మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం’ అని పేర్కొన్నారు.
సంక్రాంతి సందర్భంగా 2026 జనవరిలో విడుదల కానున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్‌గా సమీర్‌రెడ్డి, త మ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.