నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు పాత్ర కీలకం
- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ నితికా పంత్
కాగజ్ నగర్,(విజయక్రాంతి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ప్రజా భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో కాగజ్నగర్ పోలీసులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై కెమెరాలను ప్రారంభించారు.
కాగజ్ నగర్ పట్టణంలోని పాత కిమ్స్ హాస్పిటల్ పరిసర ప్రాంతంలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, బస్టాండ్, ఎన్టీఆర్ చౌరస్తా, ఆసిఫాబాద్ వైపు ప్రధాన రహదారి, సిర్పూర్ వైపు ప్రధాన రహదారి తదితర కీలక ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా కెమెరాలను అమర్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు, ట్రాఫిక్ పర్యవేక్షణకు, ప్రజల భద్రతకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌ను అభినందించారు.




