ఎండ తీవ్రతలు పెరుగుతున్న వేళ జాగ్రత్తలు తప్పనిసరి
డాక్టర్ గుగులోత్ రవి నాయక్
మరిపెడ, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): వేసవి కాలంలో రోజురోజుకు ఎండ తీవ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని మరిపెడ మండల వైద్యాధికారి డాక్టర్ గుగులోత్ రవి నాయక్ సూచించారు. వేసవి కాలంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు టోపీ లేదా గుడ్డ కప్పుకోవాలని తెలిపారు.
శరీరానికి నీరు తగ్గకుండా రోజుకు తరచూ నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.హీట్ స్ట్రోక్కు సంబంధించిన లక్షణాలుగా అధిక చెమటలు, తలనొప్పి, తల తిరగడం, వాంతులు, అలసట కనిపిస్తాయని, ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువసేపు ఎండలో ఉండకుండా చూసుకోవాలని, వారికి తరచూ నీరు ఇవ్వడంతో పాటు తేలికపాటి ఆహారం ఇవ్వాలని సూచించారు. ఎండ ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, ఏవైనా అసౌకర్యం కలిగితే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్ గుగులోత్ రవి నాయక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






