17 August, 2026 | 1:31 AM

అనాథ విద్యార్థిగృహ అధ్యక్షుడు మార్గం రాజేశ్‌కు ‘వంశీ వందే భారత్’ అవార్డు

17-08-2026 01:00 AM

ఎల్బీనగర్, ఆగస్టు 16 : ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్ కు విశిష్ట సేవలు అందించినందుకు వంశీ ఇంటర్నేషనల్ - వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక అవార్డు ‘వంశీ వందే భారత్‘ అవార్డు అందజేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఉన్న ప్రేకాస స్టూడియోలో వంశీ ఇంటర్నేషనల్ - వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్కృతి, సాహితీ , కళా, సమాజ సేవా రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు వంశీ వందే భారత్ అవార్డులు అందచేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శతాధిక చిత్రాల ప్రఖ్యాత దర్శకుడు రేలంగి నర్సింహారావు అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్ కు ‘వంశీ వందే భారత్‘ అవార్డును అందజేశారు. వంశీ ఇంటర్నేషనల్ - వంశీ ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు మాట్లాడుతూ...

మూడు దశాబ్దాలుగా అనాథ విద్యార్థులను అక్కున చేర్చుకొని, వారికి ఉచిత భోజన, వసతి, ఆన్ని విద్యా సౌకర్యాలు కల్పించి వారికి ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత ప్రవేశాలు కల్పించి, మంచి భవిష్యత్తుకు అహర్నిశలు కృషి చేస్తున్నoదుకు మార్గం రాజేశ్ ను వంశీ వందే భారత్ అవార్డుకు ఎంపిక చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రేకాస స్టూడియో అధినేత సబిత, వంశీ ఇంటర్నేషనల్ మేనేజింగ్ ట్రస్టీ శైలజ, ప్రొఫెసర్ కేవీఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.