20 April, 2026 | 1:38 AM

ఉచిత సమ్మర్ ఆర్చరీ కోచింగ్ క్యాంప్

20-04-2026 12:00 AM

డీఎస్పీ సాదుల సారంగపాణి

మహబూబాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణం, పరిసర ప్రాంతాల విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికితీయడం, వారికి శారీరక దారుఢ్యం, క్రమశిక్షణను పెంపొందించడం లక్ష్యంగా విల్లు, బాణాలను ఉపయోగించి లక్ష్యాన్ని ఛేదించే ప్రాచీనమైన, ప్రతిష్ఠాత్మక క్రీడ‘ఆర్చరీ (విలువిద్య)లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు, డీఎస్పీ సాదుల సారంగపాణి, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ మెంబర్, ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, పుట్టా శంకరయ్య తెలిపారు.

తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్, ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ వరంగల్ జిల్లా ఆర్చరీ అసోసియేషన్, శ్రీ సాదుల ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ ఆర్చరీ కోచింగ్ క్యాంప్ నిర్వహించబడుతుందన్నారు. మహబూబాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 26న శిక్షణ శిబిరం ప్రారంభిస్తామని చెప్పారు.

నెలరోజుల పాటు నిర్వహించే ఈ శిబిరంలో ఉదయం 6-8, సాయంత్రం 4.30-6.30 వరకు శిక్షణ ఉంటుందన్నారు. 10 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలురు, బాలికలు, 4వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు శిక్షణలో అవకాశం కల్పిస్తామన్నారు. ఎలాంటి ఫీజు లేకుండా పూర్తిగా శిక్షణ ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఈ కోచింగ్ క్యాంప్ ద్వారా విద్యార్థులకు ఆర్చరీలో ప్రాథమిక నైపుణ్యాలతో పాటు, శారీరక దారుఢ్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ, పోటీ స్థాయి అవగాహనను పెంపొందించబడుతుందన్నారు.

భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో రాణించేందుకు ఇది ఒక బలమైన పునాది అవుతుందని, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మీ పిల్లలలో ఉన్న క్రీడా ఆసక్తిని గుర్తించి, వారిని ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని, ఆర్చరీ క్రీడలో భవిష్యత్తు ఉన్నత అవకాశాలను అందించగలదని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు 9394643139, 9494543139 సెల్ ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.