క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం
హింసకు పాల్పడటం ప్రజాస్వామ్య సంస్కృతి కాదు
బీఆర్‌ఎస్ ‘వెయ్యి రోజుల దగా’ కార్యక్రమాలపై తీవ్ర విమర్శలు
ఆలేరు, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై మంగళవారం బీజేపీ నాయకులు(BJP leaders), కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటనను ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి(Kumbham Anil Kumar Reddy) తీవ్రంగా ఖండించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఇది రాజకీయ దాడి మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేయాలని, ప్రత్యర్థులపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలి తప్ప దాడులు, హింసకు పాల్పడటం ప్రజాస్వామ్య సంస్కృతి కాదని అన్నారు. మారణాయుధాలతో క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా వేదిక అని, భువనగిరిలో ఇలాంటి దాడుల సంస్కృతి గతంలో ఎన్నడూ లేదని పేర్కొన్నారు.
బీజేపీపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు
ఢిల్లీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) డైరెక్షన్‌లో బండి సంజయ్, బీజేపీ నాయకులు గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ సంయమనం పాటించిందని, తమ ఓపికను బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు. హద్దులు దాటితే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే గట్టిగా సమాధానం చెబుతామని అన్నారు.
ఇటీవల నల్గొండలో మంత్రి ఇంటిపై జరిగిన దాడిని కూడా ఆయన ప్రస్తావిస్తూ బీజేపీ(BJP) హింసాత్మక రాజకీయాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ‘‘చెప్పేది రాముడి పేరు.. చేసేది రావణకాండ’’ అన్న రీతిలో బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.
క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగిన అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించారని తెలిపారు. బుధవారం క్యాంప్ కార్యాలయాన్ని గోపంచకంతో శుద్ధి చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హింసకు ఎప్పటికీ తలొగ్గదని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్‌పై విమర్శల వర్షం
బీఆర్‌ఎస్ చేపట్టిన ‘‘తెలంగాణలో 1000 రోజుల దగా’’ కార్యక్రమంపై కూడా ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే అబద్ధాలు, అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన వైఫల్యాలకు బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని, ప్రజా సమస్యలపై చర్చించకుండా రాజకీయ నాటకాలు చేయడం సరికాదన్నారు.
కేసీఆర్ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి హాజరుకాకుండా ప్రజా సమస్యలకు దూరంగా ఉండటం సరికాదని విమర్శించారు. ప్రజల కోసం పనిచేయని కేసీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘‘అబద్ధాలకు అడ్రస్ అంటేనే బీఆర్‌ఎస్’’ అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక విమర్శలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అయితే హింస, దాడులు, బెదిరింపులను మాత్రం సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి–రవికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, పట్టణ కౌన్సిలర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, డీసీసీ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ అనుబంధ విభాగాల నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






