గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి
బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్
దమ్మపేట,(విజయక్రాంతి): గజ్వేల్ ఎంఎల్ఎ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డా రమేష్ అన్నారు. ఈ సందర్భంగా దొడ్డా రమేష్ మాట్లాడుతూ ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడనీ, ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడను, పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోందనీ, ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాల పైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియా పై దాడులు నిత్యకృత్యం కావడం సిగ్గుచేటనీ, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ పత్రిక ప్రకటనలో ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా? కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారు.
మీ అణచివేతలకు, మీనిర్బంధాలకు, మీ దాడులకు బిఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదనీ, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడులు జరిపిన కాంగ్రెస్ గూండాలను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర తెలంగాణ డీజీపీని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. ఇలాంటి దాడులు ఆపకపోతే, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందనీ హెచ్చరించారు.




