భద్రకాళి చెరువులో పూడిక తీత పనులు వేగవంతం చేయాలి
- కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ,(విజయక్రాంతి): భద్రకాళి చెరువులో జరుగుతున్న పూడిక తీత పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఇరిగేషన్, కుడా శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ భద్రకాళి చెరువులో పూడిక తీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించి, సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చెరువులో మొత్తం ఏడు లక్షల డెబ్బై వేల క్యూబిక్ మీటర్ల పూడిక తీత లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు సుమారు ఒక లక్ష క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించినట్లు తెలిపారు. మిగిలిన పనులను మరింత వేగంగా పూర్తి చేసి మే 15వ తేదీలోగా పూడిక తీత పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం శాయంపేటలో జరుగుతున్న భూముల సర్వే పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ భూములు అక్రమ ఆక్రమణలకు గురికాకుండా కుడా ఆధీనంలో నున్న భూములకు వెంటనే ప్రహరీ గోడలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కుడా పీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్రావు, ఇరిగేషన్ ఈఈ కిరణ్ కుమార్, డీఈ మధుసూదన్, ఏఈ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.




