ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన అధికారులపై దాడి
సెల్‌ఫోన్లు లాక్కొని భౌతికదాడులు చేసిన నోవా మెడికల్ కాలేజీ యాజమాన్యం
అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 13: బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలు తొలగించేందు కు వెళ్లిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులపై ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యం దౌర్జాన్యానికి పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో జరిగింది.
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఇరిగేషన్ ఏఈ వంశీగౌడ్ తెలిపిన ప్రకారం... జఫర్‌గూడ గ్రామ చెరువు బఫర్ జోన్‌లో కాలేజీ యాజమాన్యం నిర్మాణం చేపట్టింది. ఇరిగేషన్ అధికారులు గుర్తించి తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సిబ్బందితోపాటు ఇరిగేషన్ ఏఈ గురువారం అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వెళ్లారు.
తొలగింపులు చేపడుతున్న సమయంలో అక్కడే ఉన్న కాలేజీకి చెందిన కొందరు బౌన్సర్లు, కాలేజీ సిబ్బంది గొడవకు దిగారు. ఈ తతంగాన్ని రెవెన్యూ సిబ్బంది వీడియోలు, ఫొటోలు తీశారు. గమనించిన కాలేజీ బౌన్సర్లు అధికారుల సెల్‌ఫోన్లను లాక్కొని అందులోని రికార్డింగులను తొలగించి, వారిపై భౌతిక దాడికి దిగారు. శుక్రవారం అక్రమ నిర్మాణాలు జరుపుతున్న ప్రాంతాన్ని ఎమ్మార్వో పరిశీలించారు.






