జీపీ అనుమతులతో విల్లాలు!
- గండిపేటలో నిబంధనలకు నీళ్లు
- మున్సిపల్, హెచ్‌ఎండీఏ అనుమతులు లేకుండానే గేటెడ్ కమ్యూనిటీలో 45 విల్లాల నిర్మాణం
- ఒక్కో విల్లా ధర రూ.5 కోట్లు.. సుమారు 200 కోట్ల దందా
- అక్రమ నిర్మాణాలపై కన్నెత్తి చూడని అధికారులు
రంగారెడ్డి/రాజేంద్రనగర్ డిసెంబర్ 13 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధన లకు విరుద్ధంగా గ్రామపంచాయతీ అనుమతులతో విల్లాలు నిర్మిస్తూ కోట్ల్ల వ్యాపారానికి తెరలేపుతున్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్సింగి, బండ్లగూడ జాగీర్ పరిధిలో ప్రేమాతిపేట్, పుప్పాలగూడలో.. అక్రమంగా విల్లాలు, అపార్ట్‌మెంట్ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో ప్రతినిత్యం ఈ తతంగం అంతా నడుస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడకపోవడం విడ్డూరం.
తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అధికారులను కుడా రియల్ వ్యాపారులు మేనేజ్ చేస్త్తున్నట్లు ఆరోపణలున్నాయి. నార్సింగి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై కలెక్టర్‌తో పాటు హైడ్రాకు కుడా ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గండిపేట్‌లో రియల్ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ అనుమతులతో 45 విల్లాల నిర్మాణాలు కొనసా గిస్తున్నారు.
దర్జాగా గేటెడ్ కమ్యూనిటీ పేరుతో ఎమినిటీస్ ఏర్పాటు చేసి ఒక్కోవిల్లాకు రూ.5 కోట్లకు బేరం పెట్టి... సుమారు రూ.200 కోట్ల దందాకు తెరలేపారు. పంచాయతీ గడువు పూర్తు సుమారు ఐదేళ్లు గడిచింది. మరో నెలరోజుల్లో ము న్సిపల్ పాల కవర్గ గడువు కుడా ముగియనుంది.
ఈ తరుణంలో పంచాయతీ నిబంధనలతో విల్లాలు నిర్మించడం అతిపెద్ద చోద్యం. సామాన్యులు మున్సిపల్‌లో ఏమైనా నిర్మాణాలు సాగించాలంటే చాతాండంత నిబంధనలు, కొర్రీలు పెట్టి అనుమ తులు ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పేట్టే అధికారులు.. కోట్ల రూపాయాల విల్లాలకు అనుమతులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సామాన్యులపై అంకుశం...
నార్సింగి మున్సిపల్ పరిధిలోని గండిపేట ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం పంచాయతీ అనుమతులు తీసుకొని లేక్ ఫ్రంట్ గేటెడ్ కమ్యూనిటీ పేరుతో విల్లాలు నిర్మించారు. సుమా రు రెండున్నర ఎకరాల స్థలంలో గండిపేట రహదారి సమీపంలో దర్జాగా నిర్మాణాలు చేపట్టి పూర్తి కూడా చేశారు. కొన్నిరోజుల నుంచి అమ్మకాలు సైతం చేపట్టారు.
అయినా మున్సిపల్ అధికారులకు ఏమాత్రం పట్టింపు లేకుండాపోయింది. దర్జా గా నిబంధనలు తుంగలో తొక్కి 45 విల్లాలు నిర్మించినా ఎలాంటి చర్య లు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సామాన్య ప్రజలు మున్సిపల్ అనుమతులు తీసుకోకుండా చిన్నపాటి నిర్మాణాలు చేపడితేనే వెంటనే కూల్చివేతలు చేపట్టే మున్సిపల్ అధికారులు..
మున్సిపల్ అనుమతులు, హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకో కుండా చేపట్టిన విల్లాల వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక మతలబు ఏం అయి ఉంటుందా అని అంతా చర్చించుకుంటున్నారు. నిబంధనలు సామాన్యులకు ఒకలా, డబ్బున్నవారికి ఒకలా ఉంటాయా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బ్యాంకు లోన్లు కూడా అంతంతే...
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగిస్తే బ్యాంకులు కుడా రుణాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తాయి. పంచాయతీ పర్మిషన్‌తో నిర్మించిన విల్లాలకు జాతీయ బ్యాంకులు కూడా కొనుగోలుదారులకు లోన్లు ఏమాత్రం ఇవ్వవు.
దీనిని దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు విల్లాలు కొనుగోలు చేసేందుకు వచ్చేవారిని మభ్యపెట్టి సాధారణ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. ఇలా నిబంధనలకు విరుద్ధం గా నిర్మాణాలు కొనుగోలు చేస్తే చట్టపరంగా ఏమైనా ఇబ్బందులు తల్లెత్తితే వినియోగదారులు భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నోటీసులు ఇచ్చాం
గండిపేటలోని లేక్ ఫ్రంట్ గేటెడ్ కమ్యూనిటీలో నిర్మించిన విల్లాలకు మున్సిపల్ అనుమతులు లేవు. గతం లో పంచాయతీ అనుమతులు తీసుకొని విల్లాలు నిర్మించినట్లుగా యజమా నులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన గేటెడ్ కమ్యూనిటీ విల్లాలకు సంబంధించి గతంలోనే నోటీసులు జారీచేశాం. ఇదే విషయమై ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకొంటాం.
కృష్ణమోహన్‌రెడ్డి,
మున్సిపల్ కమిషనర్, నార్సింగి






