యువకుడి కిడ్నాప్‌కు యత్నం..!
గ్రామస్తులు అడ్డుకోవడంతో పరారీ.
బిజినపల్లిలో గంజాయి బ్యాచ్ హంగామా.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool District) బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలో కొందరు యువకుల గుంపు మరో యువకుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటన కలకలం రేపింది. పాలెం గ్రామానికి చెందిన బాగానీ రాజు (18) సెంట్రింగ్ పని చేస్తున్న సమయంలో స్కార్పియో వాహనంలో వచ్చిన కొందరు యువకులు అతడిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జావేద్, నాని, బాబిలు అనే ముగ్గురు తనపై దాడికి యత్నించి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో గ్రామస్తులు అడ్డుకోవడంతో రాజును అక్కడే వదిలి పరారైనట్లు తెలిసింది. ఈ ఘటనలో మరో ముగ్గురు కూడా ఉన్నట్లు సమాచారం. యువకులు గంజాయి మత్తులో ఉన్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు బిజినేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌కు యత్నానికి గల కారణాలు, ఘటనలో పాల్గొన్న వారి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.






