28 April, 2026 | 2:17 AM

పల్లకీల మోత బహుజనులకేల?

28-04-2026 12:00 AM

టి.చిరంజీవులు :

రాచరిక వ్యవస్థ లో మహారాజులు/రాణులు బయటకు వెళ్లిన ప్పుడు వారిని మోయడానికి బోయీలు ఉండేవారు. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ ఆధిపత్య కులాల వారు పదవులు అధిష్ఠించేందుకు, ఓటర్లనే బహుజనవర్గాల వారు పల్లకీలు పల్ల మోస్తూనే ఉన్నారు. అందుకు నిదర్శనమే తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలు. విచిత్రమేమిటంటే, ఇక్కడ ఆధిపత్య కుల మహిళలు తల్లిదండ్రులను, అన్నాదమ్ముళ్లను కూడా లెక్క చేయకుండా పార్టీ లు స్థాపించి, అధికారం కోసం తమ వారితోటే పోటీ పడుతున్నారు.

బహుశా దేశంలో ఎక్కడా ఇలాంటి వాతావరణం ఎక్కడ ఉండదేమో. తెలంగాణ, ఆంధ్రా ఒక కొత్త తరహా రాజకీయ దృశ్యం రూపుదిద్దుకుంటున్నది. ఒకే కుటుంబంలోనే రెండు రాజకీయ ధ్రువాలు ఏర్పడి, అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఒకరిపై ఇంకొకరు కత్తులు దూసుకుంటున్నారు. బహుజ నులను వాళ్లు పిచ్చివాళ్లను చేస్తున్నారు. వాళ్ల అవినీతి చిట్టాలను వారికి వారే బయటపెట్టుకొంటున్నారు. ఆంధ్రా వైఎస్ కుటుంబంలో అన్నాచెల్లెళ్ల మధ్య అధికారం కోసం పోటీ, తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో తండ్రీకూతుళ్ల మధ్య రాజకీయ పోటీ.

బయటకు ఇది భిన్న పార్టీల మధ్య పోటీలా కనిపించినా, లోపల చూస్తే.. అది ఒకే కుటుంబం లోపల అధికారం పంచుకునే ఓ రాజకీయ కుతంత్రం. అయితే.. ఈ ఆటలో బహుజనుల పాత్ర ఏమిటి? వారు పల్లకీ మోసే బోయీలేనా, ఓటు వేసే యం త్రాలేనా ? వారికి చివరకు మిగిలేది గులాంగిరియేనా? బీసీల ఓట్లతో ఆధిపత్యకులాల వారు రాజ్యాలను నిర్మిస్తారే కానీ, ఆ రాజ్యా ల్లో తమకు స్థానం లేకుండా చేసుకుంటున్నారనే నిజాన్ని బీసీలు గుర్తించలేకపోతు న్నారు. ఆధిపత్య కుల రాజకీయ కుతంత్రాలను అర్థం చేసుకోలేక, ఈ ఆటలో పావు లుగా మారుతున్నారు.

ఫక్తు రాజకీయ క్రీడ

నిజానికి ఇది ఒకే కుటుంబంలో అధికారం పంచుకునే ఆట ఒక రాజకీయ క్రీడ. బహుజనులను రాజకీయ అధికారానికి దూరంగా నెట్టే ప్రణాళికబద్ధమైన కుట్ర. వారు అధికారం కోసం రక్త సంబంధాలు లెక్కచేయకుండా పోరాడుతుంటే, సమాజంలో మెజారిటీ ప్రజలైన బీసీలు తమ ముష్టి డిమాండ్ల కోసం పోరాడాల్సి వస్తోంది. 42% రిజర్వేషన్, కులగణన, బడ్జెట్‌లో కేటాయింపులు, నిధుల విడుదల, ఉపకార వేతనాల చెల్లింపులు మొదలగునవి.

ఇవి గొంతెమ్మ కోరికలు కావు. కేవలం మనుగడ, గౌరవం, రాజ్యాంగ హక్కులకు సంబంధించినవి. అయినప్పటికీ, ఈ డిమాండ్లు సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉండటం, బీసీలు నిరంతరం ధర్నాలు, నిరసనలు, పోరాటాలపై ఆధారపడాల్సి రావ డం, ఈ వ్యవస్థలోని అసమానతను స్పష్టం గా బయటపెడుతున్నది. రాజ్యాధికారమే సమస్యలకు పరిష్కారం అనే విషయాన్నీ బహుజనులు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. ఆధిపత్య కులాల సేవలో తరించిపో తున్నారు. 

గతంలో కుటుంబ వారసత్వ పాలన మాత్రమే ఉండేది. ఇప్పుడు దానికంటే ప్రమాదకరమైన దశలోకి రాజకీయాలు మారాయి. అధికారాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఒకే కుటుంబంలో రెండు, మూడు పార్టీలు ఏర్పాటు చేసి, అధికారం తమ పరిధిలోనే బంధించే కొత్త తం త్రం. ఇది ప్రజాస్వామ్యం కానేకాదు. ఇది కుటుంబాధిపత్యానికి కొత్త ముసుగు. ప్రజాస్వా మ్యం అంటే సమాన అవకాశాలు, సమాన ప్రాతినిధ్యం, సమాన గౌరవం.

కానీ నేటి వాస్తవం ఏమిటి? రాజకీయ శక్తి కొద్దిమంది కుటుంబాలు, కొద్దికులాల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. ఎన్నికల సమయంలో పోటీ కనిపించినా, అది నిజమైన సిద్ధాంతపరమైన పోటీ కాదు. అదే వర్గం లోపల అధికార మార్పిడి మాత్రమే. ఇది కేవలం రాజకీయ వైఫల్యం కాదు ఇది సామాజిక అన్యాయానికి ప్రతిబింబం. ఒకవైపు ఆధిపత్య వర్గాలు కుటుంబ పాలన, అక్రమ సంపాదన, మీడియా మేనేజ్‌మెం ట్, ఎన్నికల్లో డబ్బు శక్తి, రౌడీ రాజకీయాలతో అధికారాన్ని కైవసం చేసుకుంటుంటే, మరోవైపు బహుజనులు కనీస అవసరాల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి.

ఈ దృశ్యం చూస్తే ఒక ప్రశ్న తప్పక తలెత్తుతుం ది. ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా? లేక ఆధిపత్య వర్గాల ప్రైవేట్ సామ్రాజ్యమా? ప్రజాస్వామ్యంమంటే కేవలం ఓటు వేయడం కాదు.. అది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం కావాలి. కానీ నేడు మెజారిటీ అయిన బీసీలు సరైన ప్రాతినిధ్యం లేదు,ఆధిపత్య కుల పార్టీల్లో ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నారు.

తెలుగురాష్ట్రాల్లో దౌర్భాగ్య పరిస్థితి

ఆధిపత్య కుల మహిళలు తెగించి రాజ్యాధికారాన్ని సాధించేందుకు నిర్భయంగా ముందుకు సాగుతున్న ఈ కాలంలో, బీసీ లు ఇంకా స్పృహను సంపాదించుకోలేకపోవడం తెలుగు రాష్ట్రాల దౌర్భాగ్య స్థితిని ప్రతిబింబిస్తుంది. దేశంలోని అనేక రాష్ట్రా ల్లో బీసీలు ముఖ్యమంత్రుల స్థాయికి ఎదిగిన ఉదాహరణలు ఉన్నప్పటికీ, ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం ఆధిపత్య వర్గాల రాజకీయ అడ్డంకులు వీరిలో ఆ రాజకీయ కాం క్ష లేకపోవడం, వారిని ఆ స్థాయికి చేరనీయడం లేదు.

సంపదలోనూ, అవకాశా ల్లోనూ బీసీలకు సరైన స్థానం లేకపోవడం మరింత విషాదకరం. భూమి, ఇసుక, గను లు, మద్యం వ్యాపారం, విద్య, ఔషధ రం గం.. ఇలా -ఏ రంగాన్ని పరిశీలించినా బీసీలు వాటాలో వెనుకబడి ఉన్నారు. ఇది యాదచ్ఛికం కాదు. ఇది నిర్మాణాత్మక అసమానతల ఫలితం. ఇంతటి అన్యాయ పరి స్థితుల్లోనూ బీసీలు ఇంకా చైతన్యం కోల్పోయి ఆధిపత్య వర్గాల రాజకీయాలకు మద్దతు ఇస్తూ ఉండటం ఆందోళన కలిగించే విషయం. 

పోరాటమే మార్గమైంది..

బహుజనుల గొంతు వినిపించాలంటే ఇప్పుడు పోరాటమే మార్గంగా మారింది. ఈ పరిస్థితి మారాలంటే అర్ధసత్యాలు కాదు. స్పష్టమైన రాజకీయ మార్పు అవసరం. సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన, బహుజన ఐక్యత ఇవే మార్గాలు. బీసీలు, బహుజనులు తమ ఓటు విలువను గుర్తించాలి, ప్రలోభాలకు లొంగకుండా ఉండాలి. తమ కుల చైతన్యాన్ని బీసీ శక్తిగా సంఘటితం చేసుకోవాలి.

ఆధిపత్య కులాల మీడియా, కుటుంబ రాజకీయాలు కలిపి సృష్టిస్తున్న అగ్రకుల మిథ్య భావజాలంలో కొట్టుకుపోవద్దు. వారికి జై కొట్టి, జెండాలు మోసి బానిసలు గా మారవద్దు. ఇకనైనా స్పృహ తెచ్చుకోండి. మీ దుస్థితికి కారణమైన రాజకీయ శక్తులను గుర్తించండి. మీ ఓటు అనే వజ్రాయుధంతో ఆధిపత్య కులాల ఆధిపత్యాన్ని అంతమొందించండి. బానిస సంకెళ్లు తెంచుకోండి. 

నిజం చెప్పాలంటే, ఇది నిజమైన రాజకీయ పోటీ కాదు.. ఇది ఆధిపత్య వర్గాల మధ్య అధికారం పంచుకునే ఆట. మెజారిటీ ప్రజలైన బీసీలు, బహుజనులను అధికారానికి దూరంగా ఉంచే ఓ రాజకీ య ఎత్తుగడ. ఈ సత్యాన్ని అర్థం చేసుకొని, దాన్ని సరిచేసే దిశగా ముందుకు సాగకపోతే, ప్రజాస్వామ్యం అనే పదం అర్థం కోల్పోతుంది. గతంలో మీ కొరకు పనిచేసే బహుజన పార్టీలు లేకుండేవి, ఇప్పుడు చాలా వస్తూనే వున్నాయి. ఆ పార్టీ అధినేతలను, నాయకులను ఆదరించండి. చైతన్యంతో ముందుకురండి.

బహుజనుల ఓట్లు బహుజనులకే వినియోగించి, తమ స్వంత నాయకత్వాన్ని నిర్మించుకొని, రాజ్యాధికారాన్ని సాధించుకోవడం సమయానుకూలమైన అవసరం. ఇప్పుడు సమయంఆసన్నమైనది. ఆధిపత్య కుల రాజకీయాలను అర్థం చేసుకుని ఓట్లు మావి.. సీట్లు మీవా? అని ప్రశ్నించే సమ యం. అలాగే.. ఓటు మాదే.. సీటు మాదే.. అని గర్జించే సమయం. మేల్కొండి. మీ తలరాతలను మీరే రాసుకోండి. బానిస సంకెళ్లు తెంచుకోండి. రాజ్యాధికారాన్ని చేతబట్టండి.

 వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్, 

బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్