23 August, 2026 | 2:43 AM

అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్‌లు బంద్

23-08-2026 01:21 AM
  1. డ్రైవర్ల సమ్మెకు కార్మికలోకం కదలాలి
  2. న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి
  3. టీఎన్టీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంకే బోసు

ముషీరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): తెలంగాణలో ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని టీఎన్టీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంకే బోసు డిమాండ్ చేశారు. డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న నిరవ ధిక బంద్‌ను విజయవంతం చేయాలని కా ర్మికలోకానికి పిలుపునిచ్చారు.

శనివారం దోమలగూడలోని తెలుగుదేశం నగర పార్టీ కార్యాలయంలో టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నల్లెల కిశోర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా బంద్‌కు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి బోసు మాట్లాడారు. ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశ పెట్టాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు.

ప్రైవేటు రవాణా కా ర్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం ఇస్తామని ప్రకటించిన రూ.12 వేల ఆర్థిక సాయం వెంటనే విడుదల చేయాలని కోరారు. అదే విధంగా ఆటో, క్యాబ్ మీ టర్ ఛార్జీలను పెంచాలని, డ్రైవర్ల జీవనోపాధికి భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక బంద్‌కు కార్మికులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బోసు పిలుపునిచ్చారు. ఈ సమా వేశంలో మాజీ కార్పొరేటర్ బాల్‌రాజ్, కనకరత్నం, శంకర్‌రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.