రాష్ట్రంలో రవాణాశాఖ అధికారులు పెన్ డౌన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు శుక్రవారం పెన్ డౌన్ చేశారు. హైదరాబాద్ జేటీసీపై జరిగిన దాడికి నిరసనగా సేవలు నిలిపివేస్తున్నట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. గురువారం హైదరాబాద్ జేటీసీ రమేశ్ పై ఆటో యూనియన్ నేత మహ్మద్ అమానుల్లాఖాన్ దాడికి పాల్పడ్డాడు. అందుకు నిరసనగా రవాణాశాఖ అధికారులు పెన్ డౌన్ పాటిస్తూ.. రవాణాశాఖ కమిషన్ తో చర్చలు జరిపిన తరువాత పెన్ డౌన్ ఆలోచనను విరమించుకుంటామని, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు.
జేటీసీపై దాడికి పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఖైరతాబాద్ లోని జేటీసీ ఆఫీసులోకి వెళ్లిన జేఏసీ నాయకుడు ఆటోలకు మీటర్లను బిగించాలని కోరారు. ఇంకా పలు సమస్యలపై చర్చించి వినతిపత్రం అందించాడు. తమ సమస్యలను పరిష్కరిస్తామని జేటీసీ రమేశ్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జేఏసీ నాయకుడు అమానుల్లాఖాన్ జేటీసీ రమేశ్ ను చెంప దెబ్బ కోట్టాడంతో సిబ్బంది లోపలికి వచ్చి అమానుల్లాఖాన్ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. జేటీసీ ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.






