అతిగా మాట్లాడితే సహించం.. పుట్ట మధు ఖబర్దార్!
మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబులపై నోరు పారేసుకుంటే తీవ్ర పరిణామాలు
కేసుల్లో బెయిల్‌పై ఉన్న వారిని అడ్డుపెట్టుకుని రాజకీయాలా?
మంథనిలో ప్రెస్ క్లబ్ లో మంథని కాంగ్రెస్ నేతల హెచ్చరిక
మంథని, జూలై 23 (విజయ క్రాంతి): మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబులపై పుట్ట మధు బుధవారం చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. గురువారం మంథని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఆయన వైఖరిపై విరుచుకుపడ్డారు. రాజకీయ హుందాతనం మరిచారని అన్నారు.
ఈ సందర్భంగా గా మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సేగ్గం రాజేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్ మాట్లాడారు. రాజకీయాల్లో తొలి అడుగులు ఎలా వేయాలో నేర్పింది కాంగ్రెస్ నాయకత్వమే. అటువంటి నాయకులపైనే ఏకవచనంతో నోరు పారేసుకోవడం తగదన్నారు.
బెయిల్ పై ఉన్న వ్యక్తులను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడితే ప్రజలు నమ్మరు.. అభివృద్ధిని చూసి కడుపుమంట
మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో మంథని నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతుంటే పుట్ట మధు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. కమిషన్లు ఆగిపోయాయనే అసహనంతోనే అభివృద్ధిని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.
గత పాలనను గుర్తుచేసుకో
అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు, అధికారులు, వైద్యులను బెదిరించిన సంస్కృతి పుట్ట మధు దేనని, ఆ ఘోరాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని నేతలు గుర్తుచేశారు. ఇతరులకు నీతులు చెప్పే ముందు తన గత పాలనను ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
ఖబర్దార్.. ఊరుకునేది లేదు
ప్రజలకు నిరంతరం సేవ చేయడమే కాంగ్రెస్ ధ్యేయమని, సంస్కారహీనమైన రాజకీయాలు తమ విధానం కాదని స్పష్టం చేశారు. అయితే, ఇకపై మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబుతో పాటు కాంగ్రెస్ శ్రేణులపై నిందలు వేస్తే గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






