15 June, 2026 | 7:33 PM

Breaking News

పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •  

మీరే తప్పుకోండి

16-06-2024 12:58 AM
  1. మీ విచారణలో నిష్పాక్షికత కనపడటం లేదు.. మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు

ఈఆర్‌సీ వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి మీరు సూచించలేదు

జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌కు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ లేఖ

విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, ‘యాదాద్రి’ నిర్మాణంలో ఆలస్యం, ‘భద్రాద్రి’లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపై వివరణలు

విచారణ పూర్తి కాకుండానే విలేకరుల సమావేశాల్లో ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టిన వైనం

* గౌరవనీయులైన జస్టిస్ నర్సింహారెడ్డి గారూ.. మీరు తెలంగాణ బిడ్డ.. తెలంగాణ అప్పట్లో ఎట్లున్నదో మీకు తెలుసు. తరువాత ఎలా తయారు చేశామో కూడా మీకు తెలుసు. తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించేలా వ్యవస్థలను తీర్చిదిద్దాము. 

 కేసీఆర్

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ‘హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేసి రిటైర్ అయినప్పటికీ.. మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. విచారణ పూర్తికాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. అన్ని అంశాలను పరగణనలోకి తీసుకుని మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను..’

అంటూ.. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యుత్తు అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్‌కు వివరణతో కూడిన లేఖ రాశారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంలో అక్రమాలు, అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా కమిషన్ నోటీసులు పంపించింది. జూన్ 15 తారీఖులోగా నోటీసుల్లో పేర్కొన్న అంశాలపై సమాధానాలు ఇవ్వాలని కోరింది.

అయితే జూలై 30 వరకు గడువు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే గడువుకు కమిషన్ నుంచి సుముఖత వ్యక్తం కాకపోవడంతో శనివారం నాడు కమిషన్‌కు వివరణతో కూడిన లేఖ రాశారు. ఇందులో అనేక సాంకేతిక అంశాలను, వివిధ అంశాల వారీగా కేసీఆర్ వివరించారు. విచారణ పూర్తి కాకుండానే విలేకరులతో మాట్లాడుతూ.. విచారణ అంశాలను చెప్పడం, పైగా తనపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆరోపణలను నిర్ధారిస్తున్నట్టుగా ఉన్నాయని పేర్కొంటూ.. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయడం సంచలనం సృష్టించింది. కేసీఆర్ లేఖలో పేర్కొన్న ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి..

జూన్ 2, 2014 నాడు రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ మొత్తం అంధకారంలో ఉందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోవడం, రైతుల ఆత్మహత్యలు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లను ఆయన లేఖలో ఉటంకించారు. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే, అన్ని రంగాలకు విద్యుత్తు కోతలు ఉం డేవని పేర్కొన్నారు. గ్రామాల నుంచి హైదరాబాద్ వరకు ఉన్న విద్యుత్తు కోతలను ఏకరువు పెట్టారు. ఆనాడు రోజుకు దాదాపు 2700 మెగావాట్ల విద్యుత్తు కొరత రాష్ట్రాన్ని వేధిస్తోందని, దీనితోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్తును ఎగవేయడం వల్ల 1500 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్తు రాకపోవడం వల్ల 900 మెగావాట్లు.. మొత్తంగా 5 వేల మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేదని తెలిపారు. 

విద్యుత్తు చట్టం పరిధిలోనే..

ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలు కూడా 2003 విద్యుత్తు చట్టం ప్రకారమే చేశామని కేసీఆర్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందం విషయంలో అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి అభ్యంతరాలు తెలిపారని, ఆయన ఆక్షేపణలను పరిగణలోకి తీసుకున్న తరువాతనే విద్యుత్తు సంస్థల ప్రతిపాదనలకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపిందని వివరించారు. రేవంత్‌రెడ్డికి ఈఆర్‌సీ నిర్ణయాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే.. ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లే అవకాశం, ఆపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే స్వేచ్ఛను చట్టం కల్పించిందని, అయితే ఆయన ఎలాంటి అప్పీలుకు వెళ్ళలేదని కేసీఆర్ స్పష్టంగా తెలిపారు.

పైగా ప్రభుత్వం మారి రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కేవలం గత ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ శ్వేతపత్రాలు విడుదల చేశారని, శాసనసభలో చర్చలు జరిగాయన్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు వేయకూడదన్న విషయాన్ని మరిచి.. ఎంక్వైరీ కమిషన్‌ను ఏ ర్పాటుచేయడాన్ని మాజీ సీఎం రాసిన లేఖలో ఎత్తిచూపారు. పైగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు (జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్) న్యాయప్రాధికార సంస్థలైన ఈఆర్‌సీ వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా కమిషన్‌గా బాధ్యతలు స్వీకరించడాన్నికూడా మాజీ సీఎం రాసిన లేఖలో ఆక్షేపించారు.

అప్పట్లో అన్నీ సబ్ క్రిటికల్ సాంకేతికతోనే

2014 నాటికి దేశంలోని 90 శాతం వరకు థర్మల్ విద్యుత్తు కేంద్రాలన్నీ సబ్ క్రిటికల్ సాంకేతికతతోనే నిర్మాణం చేసినవని, అందులో భాగంగానే.. భద్రాద్రిని అదే సాంకేతికతో నిర్మించామన్నారు. పైగా అప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని థర్మల్ ప్లాంట్లన్నీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే ఏర్పాటు చేసినవని వివరించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌ను సంప్రదించి, వారికి అందుబాటులో ఉన్న సబ్ క్రిటికల్ సామాగ్రితో రెండు సంవత్సరాల్లోనే నిర్మాణం చేస్తామని ఇచ్చిన హామీ మేరకే అప్పగించామన్నారు. పైగా అప్పుడు రాష్ట్రంలో ఉన్న విద్యుత్తు అసాధారణ సంక్షోభాన్ని పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు, ఆమోదాలు పొందిన తరువాతనే భద్రాద్రి థర్మల్ స్టేషన్‌ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో అనుకున్న గడువులోగా నిర్మించి రాష్ట్ర అవసరాలకు ఉ పయోగంలోకి తీసుకొచ్చా మన్నారు. సబ్ క్రిటికల్ ప్లాంట్ వల్ల కలిగే అదనపు బొగ్గు భారాన్ని అంచనావేసి.. బీహెచ్‌ఈఎల్‌తో సంప్రదింపులు జరిపి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లో రూ. 400 కోట్లను తగ్గించామని తెలిపారు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలనే పాలసీ మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌కు నామినేషన్‌పై ఈ నిర్మాణ పనులు ఇచ్చామని తెలిపారు. అయితే విలేకరులతో కమిషన్ మాట్లాడేటప్పుడు ఎన్‌జీటీ విధించిన స్టే ఆర్డర్, కరోనా వల్ల కలిగిన అంతరాయాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని మాజీ సీఎం కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌పై..

థర్మల్ విద్యుత్తు కేంద్రం ఎక్కడ స్థాపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయమని మాజీ సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. అప్పటికే రాష్ట్రంలో ఉన్న విద్యుత్తు కేంద్రాలన్నీ గోదావరి నదీ ఒడ్డునే ఉన్నాయని, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఒక్కటీ లేకపోవడంతో.. విద్యుత్తు కేంద్రం అనేది కేవలం విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించినదేకాకుండా.. ఆర్థికంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతోనే నల్లగొండ జిల్లా దామరచర్లలో ఏర్పాటుకు నిర్ణయించినట్టు లేఖలో తెలిపారు. సమీపంలోనే కృష్ణానది నీరు సమృద్ధిగా ఉండటం, రోడ్డు, రైల్లే లైన్లు అందుబాటులో ఉండటం, పైగా విపత్కర పరిస్థితుల్లో బొగ్గును దిగుమతి చేసుకోవడానికి వీలుగా.. కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవులు సమీపంలోనే ఉండటంతోనే దామరచర్లను ఎంపిక చేశామని వివరించారు.

పైగా ఇక్కడ వెలువడే ఫ్లుయాష్‌ను ఉపయోగించుకునే సిమెంటు పరిశ్రమలు అందుబాటులో ఉండటం, ఫ్లుయాష్‌ను తీసుకుంటామని ఒప్పందం చేసుకోవడంతో ఇది అనువైన స్థలంగా నిర్ణయించాం. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, విజయవాడ థర్మ ల్ కేంద్రం, హర్యానాలోని జజ్జర్, పంజాబ్‌లోని గోవింద్‌వాలాసాహెబ్, కర్నాటకలోని రాయచూర్ లకు బొగ్గు కేటాయించిన ప్రాంతాల నుంచి విద్యుత్తు కేంద్రాలను పోల్చుకుంటే దామరచర్లకు బొగ్గు అతి తక్కువ దూరం నుంచి లభిస్తోంది. అందుకే ఇక్కడ బొగ్గు రవాణా భారం కాదు. పైగా దేశంలో హైడల్ అయినా, థర్మల్ యినా, న్యూక్లియర్ అయినా నిర్మించే సత్తా ఉన్నది ఒక్క బీహెచ్‌ఈఎల్ మాత్రమే.

అందుకే నామినేషన్‌పై బీహెచ్‌ఈఎల్‌కు యాదాద్రి థర్మల్ కేంద్రాన్ని ఇచ్చాము. ఎన్టీపీసీతోసహా అనేక రాష్ట్రాల జెన్‌కోలుకూడా బీహెచ్‌ఈఎల్‌కు థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణాన్ని అప్పగించాయి. మనమూ అదే చేశాము. ఇక ఆలస్యం విషయానికి వస్తే.. కరోనాతో 8 నెలలపాటు పనులు స్థంభించాయి. అలాగే ఎన్‌జీటీ స్టేతో పనులు ఆగిపోయాయి. ఇవన్నీ ప్రభుత్వం, నిర్మాణ సంస్థల చేతుల్లో లేని అంశాలు. జ్యుడీషియల్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో దీని గురించి లేనప్పటికీ.. కమిషన్ వీటిని ప్రస్తావించింది. ఇది బద్నాం చేయాలనే ధోరణకి నిదర్శనమని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.

మీరు తెలంగాణ బిడ్డ...

గౌరవనీయులైన జస్టిస్ నర్సింహారెడ్డి గారూ.. మీరు తెలంగాణ బిడ్డ.. తెలంగాణ అప్పట్లో ఎట్లున్నదో మీకు తెలుసు. తరువాత ఎలా తయారు చేశామోకూడా మీకు తెలుసు. తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించేలా వ్యవస్థలను తీర్చిదిద్దాము. అయినా రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం.. అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మా ప్రభుత్వం సాధించిన దానిని తక్కువ చేసి చూపించేలా ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తే.. కమిషన్ ఛైర్మన్‌గా మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం నాకెంతో బాధించిందని మాజీ సీఎం రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.

జూన్ 15 లోగా అభిప్రాయాలను కమిషన్‌కు సమర్పించాలని అనుకున్నా.. ఎంక్వైరీ కమిషన్ సంప్రదాయాలకు భిన్నంగా, విచారణ పూర్తికాకముందే విలేకరుల సమావేశం నిర్వహించడం, నా పేరును ప్రస్తావించడం బాధించింది. వివాదం తలెత్తినప్పుడు, మధ్యవర్తిగా నిలిచి నిజాల్ని నిగ్గు తేల్చాల్సిన విధి కమిషన్‌కు ఉంటుంది. పూర్తి నిర్ధారణకు వచ్చి.. డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌తో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత కమిషన్ పై ఉంది. కానీ మీరు అలా వ్యవహరించకుండా.. కేవలం గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్టుగా స్పష్టమవుతున్న నేపథ్యంలో.. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నట్టు.. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాసిన లేఖలో స్పష్టంగా తెలిపారు. 

ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు ఒప్పందం..

ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్తు ఒప్పందాన్ని చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని, అయితే రాష్ట్ర అవసరాల రీత్యా మరో వేయి మెగావాట్లనుకూడా సరఫరా చేసేందుకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సంసిద్ధత  వ్యక్తంచేయడంతో నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే అక్కడి నుంచి తెలంగాణకు ట్రాన్స్‌మిషన్ లైన్లు లేవని, అదే సమయంలో పీజీసీఐఎల్ వార్ధా నుంచి డిచ్‌పల్లి వరకు లైను నిర్మాణం చేపట్టిందని తెలిపారు. ఈ లైను ద్వారా చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తును తీసుకురావొచ్చని తెలుసుకుని పీజీసీఐఎల్‌కు భూసేకరణ, లైను నిర్మాణం అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్నారు.

అయితే పీజీసీఐఎల్ నిర్మిస్తున్న ఈ లైనులో కారిడార్ బుక్ చేసుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు పోటీపడటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో 2000 మెగావాట్లకు మన రాష్ట్రంకూడా బుక్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇదంతా చట్ట ప్రకారమే జరిగిందని తెలిపారు. పీజీసీఐఎల్‌కు చత్తీస్‌గఢ్‌తో చేసుకున్న పీపీఏనుకూడా పంపించామన్నారు. అయితే విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలన్నీ ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే జరుగుతాయన్న వాస్తవాలను విస్మరించినట్టు అందులో పేర్కొన్నారు. 1000 మెగావాట్ల కారిడార్‌ను ఉపయోగించకున్నామని, మిగతా వేయి మెగావాట్ల కారిడార్‌ను రద్దు చేసుకున్నామని తెలిపారు.

ఇటు చత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం, అటు పీజీసీఐఎల్‌తో కారిడార్ ఒప్పందం.. అన్నీకూడా ప్రభుత్వ రంగ సంస్థల మధ్యనే కనుక.. పారదర్శకంగా జరిగాయి. వీటిని రెండు రాష్ట్రాల ఈఆర్‌సీలుకూడా మోదించాయి. ఈఆర్‌సీలు పరిశీలించి ఇచ్చిన ఆమోదాలపై తిరిగి ఎంక్వైరీ జరపాలన్న ఆలోచనే దురదృష్టకరమని లేఖలో పేర్కొన్నారు. ఇదంతా ఎలక్ట్రీసిటా చట్టం 2003 లోని సెక్షన్ 64(5) ప్రకారమే జరిగాయి. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా న్యాయ ప్రాధికార సంస్థలపై కమిషన్ వ్యాఖ్యానాలు చేయడంతో విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని లేఖలో కోరారు.