15 June, 2026 | 8:56 PM

Breaking News

ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •  

సచివాలయంలోకి ఏపీ ఉద్యోగులు!

16-06-2024 12:55 AM

సెక్షన్ ఆఫీసర్లుగా 40 మంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా 20 మంది 

  • ఏపీ స్థానికత ఉన్నప్పటికీ వేరువేరు కారణాలతో తెలంగాణకు వస్తున్న మరో 1,800 మంది ఉద్యోగులు
  • ఏపీ స్థానికత కలిగిఉండి నాన్‌లోకల్ కోటాలో తెలంగాణలో ఉద్యోగం పొందిన 1,300 మంది ఏపీకి
  •  జగన్ హయాంలో నిరాకరించిన అప్పటి సీఎం కేసీఆర్ 
  • తాజాగా సీఎం రేవంత్ ముందు ఫైల్ పెట్టిన సీఎస్ 

బూడిద సుధాకర్ :

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 15 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా అవతరించి 10 ఏండ్లు గడిచింది. విభజన చట్టంలోని 10 ఏండ్ల ఉమ్మడి రాజధాని అంగీకారం గడువుకు కూడా కాలం చెల్లింది. కానీ ఏపీ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో తిష్టవేసుడు మాత్రం ఆగడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ నగరంలో తిష్టవేసిన సీమాంద్ర ఉద్యోగులు తాజాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన 10 ఏండ్ల తర్వాత మళ్లీ తెలంగాణ సచివాలయంలోకి వస్తున్నారు

గతంలో జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ ప్రయత్నం జరిగినప్పటికీ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించని కారణంగా ఏపీ నుంచి తెలంగాణకు రావాలనుకున్న ఉద్యోగుల ఫైల్ ఆగింది. కానీ తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, సీమాంధ్ర మూలాలు కలిగి ఉన్న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అక్కడి ప్రభుత్వ పెద్దల సూచనలకు అంగీకరించడం చకచకా జరిగిందని తెలిసింది.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలకు సబంధించిన అనేక ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, వాటిని పక్కన పెట్టి ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న ఉద్యోగుల జాబితాతో కూడిన ఫైల్‌ను మాత్రం ఆగమేఘాల మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టడం పట్ల తెలంగాణ ఉద్యోగులు సీఎస్ తీరుపై మండి పడుతున్నారు.   

పెత్తనం చెలాయించేందుకేనా..

ప్రస్తుతం ఏపీ స్థానికత ఉన్న సుమారు 40 మంది సెక్షన్ అధికారులు, 20 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులు తెలంగాణకు వస్తున్నారు. సాధారణంగా సచివాలయంలో ప్రతి ఫైల్ సెక్షన్ అధికారుల ద్వారా ప్రభుత్వ పెద్దల వరకు వెళ్తుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ముందుగా సెక్షన్ అధికారులకు కూడా తెలుస్తుంది. ఇందులో ఇరిగేషన్, రెవెన్యూ, ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్, పురపాలక శాఖ, జీఏడీ వంటి సెక్షన్‌లు అత్యంత కీలకం. ఈ సెక్షన్‌లను సీమాంధ్ర ఉద్యోగులతో నింపితే తెలంగాణపై, తెలంగాణ ఉద్యోగులపై మళ్లీ సీమాంధ్ర ఉద్యోగుల పెత్తనం కొనసాగుతుందని తెలంగాణ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఆరోగ్యం, స్పౌస్, హైదరాబాద్‌లో కుటుంబం నివాసం వంటి వేరు వేరు కారణాలు చెప్పి ఏపీ స్థానికత ఉన్న మరో 1,800 మంది కూడా తెలంగాణ రాష్ట్రంలో తిష్టవేసేందుకు సిద్ధమయ్యారు. అయితే వీరిలో తెలంగాణ స్థానికత కలిగి ఉండి నాన్ లోకల్ కోటాలో ఉద్యోగం పొందిన వారు కేవలం 5 శాతం మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలిసింది. అలాగే ఏపీ స్థానికత ఉన్న సుమారు 1,300 మంది ఏపీకి వెళ్లనున్నారు. వీరిలో 98 శాతం మంది ఏపీ స్థానికత కలిగి ఉండి తెలంగాణ రాష్ట్రంలో నాన్ లోకల్ కోటాలో ఉద్యోగం పొందిన వారే కావడం గమనార్హం. గతంలో వీరు తెలంగాణకు ఆప్షన్‌లు ఇచ్చినప్పటికీ వారి భార్య/భర్త ఏపీలో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో వీరు ఏపీకి వెళ్తున్నారు. కానీ విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఉద్యోగులు మాత్రం తెలంగాణ సచివాలయంలోకి 60 మంది, ఇతర శాఖలలోకి సుమారు 1800 మంది వచ్చేందుకు రంగం సిద్దమైంది.  

తెలంగాణ ఉద్యోగులకు తీవ్రనష్టం..

ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలోకి 60 మంది ఉద్యోగులు సెక్షన్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా వస్తే తెలంగాణ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు తీవ్ర నష్టం జరగనుంది. ఏపీ ఉద్యోగుల ఎంట్రీతో తెలంగాణ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం 60శాతం తగ్గుతుంది. అలాగే 60 మంది ఏపీ ఉద్యోగులు రావడం వలన ఎలాంటి నియామకాలు జరుగకుండానే ఖాళీలు భర్తీ అవుతాయి. దీంతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అలాగే వివిధ శాఖలలో పోస్టింగ్‌ల కోసం అటెండర్ స్థాయి నుంచి ఆఫీసర్ స్థాయి ఉద్యోగుల వరకు సుమారు 1800 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వస్తుండటంతో అన్ని శాఖలలోను తెలంగాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. 

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫిర్యాదు

తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఊహించని విధంగా సీఎస్ శాంతి కుమారి ఏపీ ఉద్యోగుల ఫైల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టడంతో తెలంగాణ ఉద్యోగులు సీఎస్ శాంతి కుమారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సచివాలయంలోకి 60 మంది ఏపీ ఉద్యోగులు వస్తున్నారనే సమాచారం అందడంతో తెలంగాణ సచివాలయ ఉద్యోగులలో అలజడి మొదలైంది. ఈ క్రమంలోనే తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలోని అధికారుల ప్రతినిధి బృందం, తెలంగాణ సచివాలయ సెక్షన్ అధికారులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ఏపీ ఉద్యోగులు తెలంగాణకు రాకుండా అడ్డుకోవాలని వినతిపత్రం అందించారు.

సచివాలయ ఉద్యోగుల వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే గతంలో జరిగిన ప్రయత్నాలకు నాటి సీఎం కేసీఆర్ బ్రేకులు వేయగా, ఏపీ సీఎం చంద్రబాబును రాజకీయ గురువుగా చెప్పుకునే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనలను అంగీకరిస్తారా? లేక తెలంగాణ ఉద్యోగులకు నష్టం జరుగకుండా చూస్తారా? అనేది రెండు మూడు రోజుల్లోనే తేటతెల్లం కానుందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.