15 June, 2026 | 6:27 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

మీరు విచారణార్హత కోల్పోయారు!

16-06-2024 01:06 AM

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసుకొన్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. దాని సంక్షిప్త రూపం ఇక్కడ ఇస్తున్నాం.

హైదరాబాద్ 15 జూన్ 2024 :

గౌరవనీయులైన జస్టిస్ నరసింహారెడ్డి గారికి,

ది కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ,

సెవన్త్ ఫ్లోర్, బి.ఆర్.కె.ఆర్. భవన్, ఆదర్శ్ నగర్,

హైదరాబాద్  500053.

సబ్జెక్ట్: ది కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ, కాన్‌స్టిట్యూటెడ్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ - 1952

        వైడ్. జి.ఓ.ఎం.ఎస్. నం. 09, ఎనర్జీ (పవర్- II) డిపార్ట్‌మెంట్, డేటెడ్ 14.-3.-2024. 

రాష్ట్రం ఏర్పడ్డనాడు తెలంగాణలో విద్యుత్తు రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండడం అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్తు రంగం వల్ల ఏ ఒక్క సెక్టారుకు కూడా కరెంటు సక్రమంగా సరఫరా కాకపోయేది.

దీనివల్ల తెలంగాణలో లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోవడం, దరిమిలా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు అనే నానుడి తెలంగాణ వ్యాప్తంగా వినిపించడం, పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజుల తరబడి పవర్ హాలీడేలు ప్రకటించడం, దరిమిలా పారిశ్రామికవేత్తలు కరెంటు సరఫరా కోసం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేయడం, గృహ అవసరాలకు కూడా అన్ని అపార్టుమెంట్లలో డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడం, నగరాల్లో ఏ షాపునకు పోయినా జనరేటర్ల రొద వినిపించడం వంటి దృశ్యాలతో పాటు రాష్ట్రం మొత్తం జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు అన్నట్టుగా ఉండే విషయం మీకు తెలియనిది కాదు. రైతులు, కార్మికులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరూ కరెంటు కోతల బాధితులే. చివరికి ఎవరైనా చనిపోతే అంత్యక్రియల సమయంలో స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేని దుస్థితి నాటిది. ఇలాంటి పరిస్థితిలో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది. 

ఈ పరిస్థితులను గమనించే నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్తు అవసరాల దృష్ట్యా, రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 సంవత్సరాల విద్యుత్తు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని, విభజన తర్వాత రెండు రాష్ట్రాలు విద్యుత్తును వినియోగించాల్సిన నిబంధనలను రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం కేటాయించి, ఆవిధంగా 10 సంవత్సరాల పాటు విద్యుత్తును వినియోగించుకోవాలని నిర్దేశించింది. విభజన చట్ట ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఎంతమాత్రం సరిపోదు. అప్పటి (2014) వినియోగాన్ని అనుసరించే మనకు దాదాపు 2,700 మెగావాట్ల కొరత ఉంది.

మరోవైపు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ సరఫరాను ఎగవేయడం వల్ల 1,500 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్తు రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి మరో 2,400 మెగావాట్ల లోటు ఏర్పడింది. వెరసి మొత్తమ్మీద సుమారు 5,000 మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్తు రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. రాష్ట్రాన్ని విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్తు సంస్థలు ఏకోన్ముఖంగా పనిచేసి, కఠోర పరిశ్రమ చేసి అద్భుతమైన విజయాలు సాధించాయి.

రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7,778 మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్తు, తర్వాత సుమారు 20,000 మెగావాట్ల పైచిలుకుకు చేరడం, అటు సరఫరా, పంపిణీ వ్యవస్థలు పటిష్ఠపడి సక్రమ విద్యుత్తు సరఫరా చేసే స్థాయికి ఎదగడం, తద్వారా మన భారతదేశంలోనే నాణ్యమైన నిరంతరాయ (24X7) కరెంటును అన్ని రంగాలకూ సరఫరా చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ వినుతికెక్కడం తమరికి తెలియని విషయం కాదు. 2014లో రాష్ట్రం ఆవిర్భవించిన నాడు తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 1,196 యూనిట్లు ఉండగా, పదేండ్ల కాలంలోనే అది 2,349 యూనిట్లకు పెరగడం, ఆ ఫలాలను మనమంతా అనుభవించడం మనందరికీ గర్వకారణం. 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పనిచేసిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విజయాలను ఆషామాషీగా సాధించలేదు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ పురోగమించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం ఏర్పడిన న్యాయ ప్రతిపత్తి కలిగిన స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఎస్‌ఈఆర్‌సి)ల తీర్పులకు లోబడే అన్ని చర్యలూ తీసుకోవడం జరిగింది. అట్టి చర్యలపై అభ్యంతరాలు ఉంటే ఈఆర్‌సీలు నిర్వహించే పబ్లిక్ హియరింగుల్లో  తెలియజేయవచ్చు. అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఈఆర్‌సీ తీర్పు వెలువడితే వారు ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఆప్టెల్)కు అప్పీలు చేసుకోవచ్చు.

ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేయడంపై నాటి టీడీపీ ఎమ్మెల్యే శ్రీ రేవంత్‌రెడ్డిగారు తెలంగాణ ఈఆర్‌సీకి అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. ఆయన ఆక్షేపణలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే, తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్‌సీ ఆమోదముద్ర వేయడం జరిగింది. అప్పటికీ రేవంత్‌రెడ్డికి ఈఆర్‌సీ నిర్ణయాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉండి ఉంటే ఆప్టెల్‌కు వెళ్లే అవకాశం, తదనంతరం సుప్రీంకోర్టును కూడా సంప్రదించే స్వేచ్ఛను చట్టం కల్పించింది. కానీ ఆయన ఎలాంటి అప్పీలుకూ వెళ్లిన దాఖలాలు లేవు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, గొప్ప విద్యుత్తు విజయాలను సాధించిన గత ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేసింది. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వయిరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని కూడాప్రభుత్వం కోల్పోయి ఒక ఎంక్వైరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది.

అట్టి ఎంక్వైరీ కమిషన్‌ను మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేయడం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు, ఈఆర్‌సీల తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. తర్వాత మీరు చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి, అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే, పరిగణనలోకి తీసుకోకుండానే 11.06.2024 నాడు విలేకరుల సమావేశం నిర్వహించి, పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తూ, నా అభ్యంతరాలను మీకు తెలియజేస్తున్నాను.   

థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో రెండు రకాలున్నాయి. 1. సబ్ క్రిటికల్. 2. సూపర్ క్రిటికల్. సబ్ క్రిటికల్ అనేది పాత టెక్నాలజీ కాగా, సూపర్ క్రిటికల్ అనేది దాని తర్వాత వచ్చినది. సబ్ క్రిటికల్ కంటే సూపర్ క్రిటికల్ వల్ల కాలుష్యం తక్కువ. అయితే సబ్ క్రిటికల్ కన్నా సూపర్ క్రిటికల్ ప్లాంట్ నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ. తెలంగాణ కొత్త విద్యుత్తు కేంద్రాల నిర్మాణం ప్రారంభించే 2014 నాటికి భారత దేశంలో సుమారు 90 శాతం థర్మల్ విద్యుత్కేంద్రాలు సబ్ క్రిటికల్ పద్ధతిలో నిర్మాణమైనవే. ఒకటి రెండు మాత్రమే సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాలున్నాయి.  వీలైనంత వేగంగా కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాలను నిర్మించాలని అప్పటికి దేశంలో భారీ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంలో పేరెన్నిక గన్న సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)ను సంప్రదించడం జరిగింది. సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో రెండేండ్లలోనే మణుగూరులో 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మించి ఇవ్వగలమని, కొత్తగూడెంలో 800 మెగావాట్ల ఏడో దశను మాత్రం సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ప్లాంటును నాలుగేండ్లలో ఇవ్వగలంమని ఆ సంస్థ తెలిపింది. దీంతో అప్పుడు తెలంగాణలో ఉన్న తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మణుగూరులో సబ్ క్రిటికల్ పద్ధతిలో థర్మల్ ప్లాంటు నిర్మాణానికి శ్రీకారం చుట్టబడింది. 

2014 నాటికి సబ్ క్రిటికల్‌పై ఎలాంటి నిషేధంగానీ, నియంత్రణగానీ లేదు.  అయితే మీరు 11.-6.-24 రోజున నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేను పైన తెలిపిన ఏ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్‌పై విపరీత వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు దేశంలో 90 శాతం సబ్ క్రిటికల్ ప్లాంట్లే ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే సబ్‌క్రిటికల్ ప్లాంట్ పెట్టి చేయరాని తప్పు ఏదో చేసినట్టు మీరు మాట్లాడిన తీరు దురుద్దేశాన్ని బయటపెట్టింది. 2017 వరకు అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళికలో కూడా సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవన్న వాస్తవాన్ని  మీరు విస్మరించారు. అందువల్ల మీరు ఈ అంశాన్ని విచారించే అర్హతను కోల్పోయారు. కాబట్టి మీరు మీ బాధ్యతలనుంచి విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 

2014లో రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎంతటి తీవ్ర కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొన్నదో నేను మీకు ముందే వివరించాను. అప్పటికి తెలంగాణ నేషనల్ గ్రిడ్ కనెక్ట్ కాకుండా, కేవలం దక్షిణ గ్రిడ్‌లోనే ఉంది. దీంతో ఈ కరెంటు లోటును పూడ్చుకోవడానికి దక్షణాదిలో ఎక్కడైన విద్యుత్తు అందుబాటులో ఉందా పరిశీలించాలని అప్పటి మా ప్రభుత్వం విద్యుత్తు సంస్థలను ఆదేశించింది. మనకు పొరుగునే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మిగులు విద్యుత్తు ఉన్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తీసుకొనే సాధ్యాసాధ్యాలపై ఆ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్తు సంస్థల అధికారులు సంప్రదింపులు జరిపారు. చర్చల అనంతరం ఛత్తీస్‌గఢ్ మొదట 1000 మెగావాట్లు భవిష్యత్తులో అవసరమైతే మరో 1000 మెగావాట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ తర్వాత 3.-11.-2014 తేదీన రాయ్‌పూర్‌లో జరిగిన సమావే శంలో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ 1000 మెగావాట్ల కరెంటు కొనుగోలు చేసేందుకు ఎంవోయూ కుదుర్చుకోవడం జరిగింది. ఈ సమయంలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మరో 1000 మెగావాట్లు సమకూర్చడానికి సుముఖత వ్యక్తం చేసింది. 

అయితే ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేసేందుకు ట్రాన్స్మిషన్ లైన్లు లేవు.  అదే సమయంలో పీజీసీఐఎల్ మహారాష్ట్రలోని వార్ధా నుంచి డిచ్‌పల్లి వరకు లైన్ నిర్మాణం ప్రారంభించింది. దాని ద్వారా ఛత్తీస్‌గఢ్ కరెంట్ తెలంగాణకు తీసుకువచ్చే వీలుందని తెలుసుకొని విద్యుత్ సంస్థల అధికారులు ఆ సంస్థతో సంప్రదింపులు జరిపారు. ఆ లైన్ నిర్మాణం సత్వరం పూర్తి కావడానికి భూ సేకరణ మొదలైన అంశాల్లో సహాయ సహకారాలు అందజేశారు. తెలంగాణ ఆ కారిడార్ బుక్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.  డెడికేటెడ్ లైన్ కోసం ఒప్పందం చేసుకోవాలంటే పీజీసీఐఎల్ షరతుల ప్రకారం మనం ఎవరి నుంచి విద్యుత్తు కొనుగోలు చేస్తున్నామో వివరంగా పేర్కొని వారితో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ప్రతిని కూడా సమర్పించాల్సి ఉంటుంది.

పీజీసీఐఎల్ విధించే మరొక నిబంధన ఏమిటంటే కారిడార్ బుక్ చేయడానికి అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే పద్ధతిని పాటిస్తుంది. దీంతో తెలంగాణ వద్ద ఆ కారిడార్ బుక్ చేసుకోవడం తప్ప మరో మార్గం లేకపోయింది.   అయితే 11-.6.-2024 నాడు మీరు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పైన నేను పేర్కొన్న అంశాలేవీ పరిగణనలోకి తీసుకోకుండా మార్వా నుంచి విద్యుత్తు కొనుగోలు వ్యవహారాన్ని తప్పుబట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలన్నీ ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే జరుగుతాయన్న వాస్తవాన్ని విస్మరించి మీరు మాట్లాడటం అత్యంత దురదృష్టకరం. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు సరఫరా ప్రారంభమైన తర్వాత 1000 మెగావాట్ల కారిడార్‌ను ఉపయోగించుకోవడం జరిగింది. మిగితా 1000 మెగావాట్లకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ నుంచి ఆశించిన మేరకు కరెంటు సరఫరా కాకపోవడంతో రెండో 1000 మెగావాట్ల కారిడార్‌ను రద్దుచేసుకోవడం జరిగింది.

యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ను దామరచెర్లలోనే ఎందుకు పెట్టాల్సివచ్చింది అన్నది మీ విచారణాంశాల్లో ఉన్నది. ఒకటి.. ఒక విద్యుత్కేంద్రాన్ని ఎక్కడ స్థాపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయం. అనేక విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో స్థలాన్ని ఎంపిక చేస్తుంది. తెలంగాణ దక్షిణ ప్రాంతంలో ఉన్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఒక్క భారీ విద్యుత్‌కేంద్రం కూడా లేదు. విద్యుత్‌కేంద్ర నిర్మాణం అంటే విద్యుదుత్పత్తికి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. ప్లాంటు నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ ఎంతో పెరుగుతుంది. ఆర్థికంగా ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎన్టీపీసీ ప్లాంటు కారణంగా రామగుండం ఎట్లా అభివృద్ధి చెందిందో మనందరం మన కండ్లతో చూస్తున్నం.

వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అప్పటి ప్రభుత్వం  వెనకబడ్డ నల్లగొండ జిల్లాలోని దామరచర్లను ఉద్దేశపూర్వకంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ఎంపిక చేసింది.  భవిష్యత్తులో  సోలార్ పవర్ ప్లాంటు పెట్టుకోవడానికి కూడా దామరచర్లలో వెసులుబాటు ఉన్నది.  సింగరేణి బొగ్గు గనులు తెలంగాణలోనే ఉన్నా ఆ బొగ్గును కేటాయించేది మాత్రమే కేంద్ర ప్రభుత్వమే. థర్మల్ కేంద్రాలకు బొగ్గే ప్రధాన ఇంధనం. బొగ్గు గనుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతున్న సందర్భాలను మనం ఇటీవల గమనిస్తూనే ఉన్నాం. వీటన్నింటి దృష్ట్యా వ్యూహాత్మకంగా దామరచర్లను ఎంపిక చేయడం జరిగింది. దామరచర్లకు సమీపంలో కృష్ణపట్నం, బందరు (మచిలీపట్నం) రేవులున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఈ పోర్టుల నుంచి బొగ్గును దిగుమతి చేసుకునే అవకాశం ఉంది.

అదీగాక దామరచర్ల అటు నేషనల్ హైవేకు, ఇటు రైల్వే లైన్‌కు సమీపంలోనే  ఉన్నది. అందువల్ల రవాణాకు సంబంధించిన సమస్యలుండవు. కృష్ణానది తీరంలో ఉన్న దామరచర్లకు అటు నాగార్జున సాగర్ నుంచి, ఇటు టెయిల్పాండ్ నుంచి కావాల్సినన్ని నీళ్లు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి భారీగా ఫ్లైయాష్ వెలువడుతుంది. దామరచర్లలో నిర్మించేది 4000 మెగావాట్ల భారీ థర్మల్ ప్లాంటు కనుక దీన్నుంచి పెద్దమొత్తంలో ఫ్లైయాష్ వెలువడుతుంది.  ఫ్లైయాష్‌ను వాడుకునేది ప్రధానంగా సిమెంటు పరిశ్రమలు. ఇవి దామరచర్ల సమీపంలోనే ఎక్కువగా ఉన్నాయి. ప్లాంటు నుంచి వచ్చే ఫ్లైయాష్‌ను వాడుకుంటామని అవి ప్రభుత్వానికి లిఖిత పూర్వక హామీ కూడా ఇచ్చాయి. ఇన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి దామరచర్లను ఎంపికచేయడం జరిగింది. 

మీ పరిశీలనార్థం ఉన్న విషయాల్లో కోల్ లింకేజీతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా ఉన్నది. బొగ్గు రవాణా వ్యయమే ప్రాతిపదిక అనుకుంటే రాయలసీమ ప్రాంతంలోని ముద్దనూరు పవర్ ప్లాంట్‌ను బొగ్గు గనులకు 580 కిలోమీటర్ల దూరంలో ఎందుకు నిర్మించినట్టు? సింగరేణి గనులకు సుదూరంగానూ మరియు తాల్చేరు బొగ్గు గనులకు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడలో థర్మల్ ప్లాంటును ఎందుకు పెట్టినట్టు? బొగ్గు గనులకు ఎంతో దూరంగా ఉన్నప్పటికీ, హర్యానాలోని జజ్జర్లో, పంజాబ్లోని గోవింద్వాలా సాహెబ్లో, కర్ణాటకలోని రాయచూర్ (శక్తినగర్)లో, బళ్లారిలో, తమిళనాడులోని మెట్టూరులో థర్మల్ ప్లాంట్లు ఎందుకు పెట్టినట్టు? థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ప్రాంతీయ మౌలిక సదుపాయాల సమతుల్యత, ఆర్థికాభివృద్ధి, లోడ్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌మిషన్ లాసెస్‌ను తగ్గించడం, విపత్తుల నివారణ (డీ రిస్కింగ్) అనేవి కూడా ప్రధాన ప్రాతిపదికలుగా ఉంటాయన్న వాస్తవాన్ని మీరు విస్మరించడం ఎంతో దురదృష్టకరం. 

హానరబుల్ జస్టిస్ నర్సింహారెడ్డి గారూ! మీరు కూడా తెలంగాణ బిడ్డ. 2014కు ముందు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎట్లుండేదో, తర్వాత ఎట్లున్నదో అందరితోపాటు మీకూ తెలుసు. చీకటి రోజుల గతాన్ని వెలుగు జిలుగుల భవిష్యత్తుగా మారడానికి అప్పటి ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా చూశారు. తెలంగాణలో అన్ని రంగాలకూ 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్తు ఎలా అందించామో, దేశంలో ఇలా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అనే ప్రఖ్యాతి ఎలా వచ్చిందో, నిరంతర విద్యుత్తుకు ఆకర్షితులై ఐటీ కంపెనీలు హైదరాబాద్కు ఎలా క్యూ కట్టాయో, 2014లో కేవలం రూ.57 వేల కోట్లున్న తెలంగాణ ఐటీ ఎగుమతులు  2020 నాటికి రూ. 2.41 లక్షల కోట్లకు ఎలా పెరిగాయో, పారిశ్రామిక, వ్యావసాయిక ప్రగతి ఎలా జరిగిందో, ఏటా లక్షలాది మోటార్లు కాలడం ఎలా ఆగిందో, జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు ఎలా మాయమయ్యాయో, హైదరాబాద్ తదితర నగరాల్లో డీజిల్తో నడిచే జెన్సెట్లు ఎలా మూలకు పడ్డాయో, తెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా ఎలా మార్మోగిందో అందరితో పాటు మీరూ గమనించారు.

అయినా రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. నిజానికి మీ పిలుపు మేరకు, లోక్‌సభ ఎన్నికల తర్వాత, 2024 జూన్ 15 లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వయిరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక ముందే మీరు విలేకరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, పదేండ్లు పరిపాలించిన నా పేరును ప్రస్తావించడం, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయదలిచి ఇచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత.

ఇరు పక్షాల మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు, మధ్యవర్తిగా నిలిచి, అసలు నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన విధి. అన్ని విషయాలను, అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి, పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత, డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌తో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని. కానీ మీ వ్యవహారశైలి అట్లా లేదని చెప్పడానికి చింతిస్తున్నాను. విచారణ పూర్తి కాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

ధన్యవాదాలతో.. 

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ ముఖ్యమంత్రి


ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణ పీపీఏ చేసుకున్న 2014 సంవత్సరంలోనే తమిళనాడు టెండర్ పద్ధతిలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్నది. దాని యూనిట్ రేటు రూ.4.94. అదే సంవత్సరం కర్ణాటక కూడా టెండర్ పద్ధతిలో పీపీఏ చేసుకున్నది. యూనిట్ రేటు రూ.4.33. ఎన్టీపీసీ సింహాద్రి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో నామినేషన్ పద్ధతిలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం జరిగింది. కాగా మనం ఛత్తీస్‌గఢ్‌తో నామినేషన్ పద్ధతిలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ. 3.90కే యూనిట్ కరెంటు కొంటే అది ఎక్కువ కాస్ట్ ఎట్లా అవుతుంది? అలాంటప్పుడు తెలంగాణ హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చిందని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారు. ఈ దృష్ట్యా కూడా మీరు ఈ వ్యవహారం పై విచారణ జరిపే అర్హత కోల్పోయారు. అందువల్ల స్వచ్చందంగా విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.