2 April, 2026 | 3:40 AM

ఆటిజంపై అవగాహన అవసరం

02-04-2026 01:38 AM

కిమ్స్ కడల్స్ వైద్యురాలు ప్రభ్‌జోత్ కౌర్

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఏటా ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంను ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 2008 నుంచి నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రి కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యమయింది. ఆటిజం పట్ల అవగాహన ఉంటే అనేక పిల్లల జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయు లు, సమాజం కలిసి పనిచేస్తే ఈ పిల్లల భవిష్యత్తు కొత్త దిశలో సాగుతుందని డా. ప్రభ్ జోత్ కౌర్ (హెచ్‌ఓడి అండ్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, కిమ్స్ కడల్స్, సికిం ద్రాబాద్) చెపుతున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఒక జీవితకాల న్యూరో డెవల ప్మెంటల్ పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా సిడిసి నివేదికల ప్రకారం ప్రతి 36 మంది పిల్లల్లో ఒకరికి ఆటిజం గుర్తించబడుతోంది. భారతదేశంలో ఖచ్చిత గణాంకాలు లేకపోయినా, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అధ్యయనాల ప్రకారం నగర ప్రాంతాల్లో ప్రతి 100 మంది పిల్లల్లో ఒకరికి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి.

స్పెక్ట్రమ్ అనే పదం కారణంగా ప్రతి పిల్లవాడు వేరు వేరు లక్షణాలతో ఉంటారు. చిన్న వయసులోనే కొన్ని సంకేతాలను గుర్తిస్తారు. కంటి కలయిక తగ్గ డం, ఒకే వస్తువుపై ఎక్కువగా దృష్టి పెట్టడం, రోజువారీ మార్పులను తట్టుకోలేక తీవ్రంగా స్పందించడం, మాటలు ఆలస్యంగా రావ డం లేదా వచ్చిన మాటలు తిరిగి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

చేతులు ఊపడం, వస్తువులను వరుసగా పెట్టడం, శబ్దాలు లేదా వెలుతురు పట్ల అధిక సున్నితత్వం వంటి ప్రవర్తనలు కూడా సూచనలుగా ఉండవచ్చు. టీకాలు ఆటిజానికి కారణమవుతాయని చెప్పే అభిప్రాయాలు పూర్తిగా తప్పు. ఇది జన్యు, మెదడు అభివృద్ధి సంబంధిత అంశాల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఆటిజం ఉన్న పిల్లల్లో ప్రత్యేక ప్రతిభలు కూడా కనిపిస్తాయి. గణితం, సంగీతం, కళలు వంటి రంగాల్లో అద్భుతమైన నైపుణ్యం ఉండవచ్చు.

సరైన ప్రోత్సా హం ఉంటే వారు గొప్ప విజయాలు సాధించగలరు. కిమ్స్ కడల్స్‌లో మేము ఆధునిక, శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తున్నాం. డెవలప్మెంటల్ హిస్టరీ, ప్లే-బేస్డ్ అబ్జర్వేషన్, ఏడిఓఎస్ వంటి పరికరాలతో ఖచ్చితమైన నిర్ధారణ చేస్తాము. ఆపై వ్యక్తిగత థెరపీ ప్రణాళిక రూపొందిస్తాము. ఏబిఏ థెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి చికిత్సలు పిల్లల అభివృద్ధికి సహాయపడతాయి’ అని తెలిపారు.