నేడు కంది రైతులకు అవగాహన సదస్సు
వికారాబాద్, మే 23 (విజయక్రాంతి) : నేడు తాండూరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విత్తన మేళ జరగనుంది. ఈ మేరకు తాండూరు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి. సుధారాణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరం మే 24న విత్తన మేళ నిర్వహిస్తుందన్నారు.
అందులో భాగంగానే నేడు తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కొత్తగా రూపొందించిన వివిధ కంది రకాలను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నూతన వంగడాల లక్షణాలు, వాటి గుణగణాలపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొత్త రకాల విత్తనాలు కూడా తాండూరు పరిశోధన కేంద్రంలో అందుబాటులో ఉన్నాయన్నారు. అవసరం ఉన్న రైతులు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.






