31 July, 2026 | 12:59 AM

ఎగుమతి ప్రోత్సాహకంపై అవగాహన

31-07-2026 12:00 AM

సలహాలు సూచనలు చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి 

రంగారెడ్డి, జులై 30 (విజయక్రాంతి): జిల్లాలో ఎగుమతులను మరింత ప్రోత్సహించడం మరియు స్థానిక పరిశ్రమలు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేలా ప్రోత్సహించే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ’మెగా ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమం’ గురువారం ఘనంగా నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి ఆధ్వర్యంలో, ’డిస్ట్రిక్ట్ యాస్ ఎక్స్పోర్ట్ హబ్’ పథకంలో భాగంగా డీజీఎఫ్టీ అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో రంగారెడ్డి జిల్లా కీలక పాత్ర పోషిస్తోందని, నగర సమీప ప్రాంతం కావడంతో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, మెరుగైన కనెక్టివిటీ ఇక్కడ లభిస్తున్నాయని తెలిపారు.

ఫార్మా, ఐటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, సోలార్, క్వారట్జ్ తదితర రంగాలు జిల్లాలో ప్రధాన తయారీ మరియు సేవా కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు.ఈ అవగాహన సదస్సులో జాయింట్ డీజీఎఫ్టీ శఎస్.ఎ. చవాన్, డీఐసీ జీఎం ఎం. శ్రీ లక్ష్మి, ఎంఎస్‌ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్  ఎన్. సుమతితో పాటు ఏపీఈడీఏ, వాల్మార్ట్, ఇండియా పోస్ట్ తదితర ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఎగుమతి విధానాలు, అంతర్జాతీయ మార్కెటింగ్ అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఇ-కామర్స్ ద్వారా వ్యాపార విస్తరణ మరియు పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించిన సందేహాలను అధికారులు ఈ సందర్భంగా నివృత్తి చేశారు.