18-01-2026 08:44:33 PM
నూతనకల్,(విజయక్రాంతి): రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం 'అరైవ్ - అలైవ్'లో భాగంగా నూతనకల్ మండల కేంద్రంలో వాహనదారులకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగరాజు మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డిఫెన్సివ్ డ్రైవింగ్ (అప్రమత్తంగా వాహనం నడపడం) ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం నేరమని, దీనివల్ల తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతరం నిర్వహిస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.