సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన
- జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్
కొండపాక: కుకునూరుపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డా. సి.హెచ్. ధనరాజు మంగళవారం ఆకస్మికంగా సందర్శించి, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిహెచ్ ధనరాజ్ మాట్లాడుతూ... వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామాల్లో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని, జ్వరం వంటి లక్షణాలతో వచ్చే ప్రతి రోగికి వెంటనే పరీక్షలు నిర్వహించి తక్షణ చికిత్స అందించాలని ఆదేశించారు.
గర్భిణులను నమోదు చేసిన నాటి నుంచి సురక్షిత ప్రసవం జరిగే వరకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఇంటింటి సందర్శనల సందర్భంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అవసరమైన వైద్య సూచనలు అందించాలని పేర్కొన్నారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు శాతం వందకు పూర్తి చేయాలని, ఎలాంటి పిల్లలు టీకాలకు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం "డ్రై డే" కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించి దోమల ఉత్పత్తి స్థలాలను నిర్మూలించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలోని రికార్డులు, ఔషధ నిల్వలు, సేవల అమలు తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.






