చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
రాచకొండ సీపీ తరుణ్ జోషి ఐపీఎస్
మహేశ్వరం, మే 23 (విజయక్రాంతి) : నూతన న్యాయ చట్టాలు దేశ అంతర్గత భద్రతలో గొప్ప మైలురాయి అని, చట్టాల మీద పోలీస్ సిబ్బందికి సంపూర్ణ అవగాహన ఉండాలని రాచకొండ సీపీ తరుణ్ జోషి ఐపీఎస్ పేర్కొన్నారు. గురువారం ఆర్‌సీఐ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జులై 1వ తేదీ నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు అమలులోకి రానున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాల మీద సిబ్బంది పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు.
మన దేశం స్వాతంత్య్ర దేశంగా మారిన తరువాత కూడా వలస పాలన నాటి చట్టాల ప్రకారమే నేర న్యాయ వ్యవస్థ, శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇన్నాళ్లు ఎన్నో సవాళ్లును ఎదుర్కొన్నామని, అవసరాన్ని బట్టి ప్రభుత్వం కొన్ని చట్టాల్లో మార్పులు చేర్పులు చేసినట్లు గుర్తు చేశారు. అమలులోకి రానున్న నూతన నేరన్యాయ చట్టాలతో ప్రజలకు మరింత సేవలను అందించే అవకాశం ఉంటుదన్నారు. నూతన విధానాలకు విరుద్దమైన వాటిని ఎట్టి పరిస్థితుల్లో పాటించవొద్దన్నారు. నూతన సెక్షన్ల ప్రకారం మాత్రమే వివిధ రకాల కేసులను నమోదు చేయాలని ఆదేశించారు. నూతన చట్టాలపై జోన్ల వారీగా సమీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ సునీతరెడ్డి, ఏసీపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






