19-12-2025 07:41:57 PM
- జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ
మంచిర్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్ యాప్ నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో వ్యవసాయ, సహకార శాఖ అధికారులు, ఎరువుల డీలర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఎరువుల బుకింగ్ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఈ యాప్ ద్వారా నిజమైన సాగుదారులకు జిల్లాలో యూరియా నిల్వల సమాచారం తెలుస్తుందని, ఎరువుల షాపుల వద్ద రద్దీ లేకుండా ఇంటి వద్దనే తమ మొబైల్ లో యాప్ వినియోగించి ఎరువులను (యూరియా) 24 గంటలలో పొందవచ్చని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల డీలర్లు వారు నిర్వహించవలసిన విధులపై అవగాహన కల్పించడం జరిగిందని, ఈ నెల 20వ తేదీ నుండి యాప్ అందుబాటులో తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.
ఈ యాప్ ద్వారా మాత్రమే యూరియా బుక్ చేసుకుని రైతులు/సంబంధికులు బుకింగ్ ఐ.డి., పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు పత్రాలను డీలర్ వద్ద ధ్రువీకరించుకొని యూరియా బస్తాలను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్, మండల వ్యవసాయ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శులు, ఎరువుల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.