ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
భిక్కనూర్, మార్చి 24: ప్రపంచ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకొని భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు ఉప కేంద్రాల పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు టిబి వ్యాధిపై చైతన్యం కల్పించేందుకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ దివ్య పాల్గొని మాట్లాడుతూ, టిబి ఒక సంక్రమణ వ్యాధి అని, ఇది ఒకరి నుంచి మరొకరికి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు.
రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిబికి ఉచితంగా చికిత్స లభిస్తుందని, మందులను క్రమం తప్పకుండా వాడితే పూర్తిగా నయం అవుతుందని పేర్కొన్నారు. దగ్గేటప్పుడు నోరు మూసుకోవడం, ఇంటిలో గాలి, వెలుతురు సమృద్ధిగా ఉండేలా చూడడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
టిబి బాధితులను దూరం పెట్టకుండా వారికి మానసిక ధైర్యం ఇవ్వాలని, సమయానికి పరీక్షలు చేయించుకుని మందులు సక్రమంగా వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని వైద్యాధికారులు తెలిపారు. హెచ్ ఈ ఓ వెంకట రమణ,ఎమ్ ఎల్ హెచ్ పి సతీష్ ,ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




