4 March, 2026 | 9:19 PM

వార్డు సభ్యుల సామర్థ్య వృద్ధికి అవగాహన సదస్సు

04-03-2026 07:33 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల పరిషత్ కార్యాలయం కేంద్రంలో వార్డు సభ్యుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సు విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డీపీవో షరీఫ్ ఉద్దీన్, ఎంపీవో మీర్జా అఫ్జల్ అహ్మద్ బేగ్, సూపరింటెండెంట్ దొంతుల రమేష్, జేఈ రాజనర్సు తదితరులు హాజరయ్యారు. సదస్సులో గ్రామ పంచాయతీల విధులు, వార్డు సభ్యుల బాధ్యతలు, అభివృద్ధి పనుల అమలు విధానం, ప్రభుత్వ పథకాల సమర్థ వినియోగం వంటి అంశాలపై వివరమైన అవగాహన కల్పించారు.

ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చొరవ చూపాలని అధికారుల సూచనలు చేశారు. డీపీవో షరీఫ్ ఉద్దీన్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమని, సమన్వయంతో పనిచేస్తే గ్రామాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని అన్నారు. ఎంపీవో మీర్జా అఫ్జల్ అహ్మద్ బేగ్ గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులు నాణ్యతతో పారదర్శకంగా ఉండేలా పర్యవేక్షణ చేయాలని తెలిపారు.

సూపరింటెండెంట్ దొంతుల రమేష్ మరియు జేఈ రాజనర్సు అభివృద్ధి పనుల్లో సాంకేతిక ప్రమాణాలు పాటించడం, నిధుల సరైన వినియోగం చేయడం ముఖ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.