నేరెళ్ల బాధితుల పక్షాన నిలిచిన తీన్మార్ మల్లన్న
2017 ఘటనపై మళ్లీ రగిలిన న్యాయ పోరాటం
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో 2017లో జరిగిన పోలీస్ దాడి ఘటన బాధితులను తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లిన మల్లన్న వారి సమస్యలను స్వయంగా విన్నారు.
ఇప్పటికీ న్యాయం జరగలేదు బాధితుల ఆవేదన
ఇసుక లారీ దహనం కేసు నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారని బాధితులు గుర్తుచేశారు. ఐదు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచి థర్డ్ డిగ్రీ పద్ధతులు అనుసరించారని ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ, బాధ్యులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
హామీలు… కానీ చర్యలు లేవని విమర్శ
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీ అమలు కాలేదని అన్నారు. అలాగే బీజేపీ నేత బండి సంజయ్ కూడా తమకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని, కానీ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
అప్పటి ఎస్‌పీ విశ్వజిత్ కంపాటి, ఎస్‌ఐ రవీందర్‌ల పాత్రపై పూర్తి స్థాయి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. రాజకీయ లాభాల కోసం తమను ఉపయోగించుకుని తరువాత పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న హెచ్చరిక ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ... నేరెళ్ల బాధితులకు తక్షణ న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. న్యాయం జరిగే వరకు తమ పార్టీ బాధితుల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.




