08-11-2025 12:00:00 AM
భారతదేశం వంటి విభిన్న సాంస్కృతిక దేశంలో మద్యం వినియోగం ఎప్పటి నుంచో సామాజిక, ఆరోగ్య, ఆర్థిక సమస్యలకు మూలమై ఉంది. మద్యం తాగడం వ్యక్తిగత నిర్ణయమని కొందరు అంటారు. కానీ దాని ప్రభావం సమాజంపై గట్టిగా పడుతుంది. గృహహింస కేసులు, రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, పేదరికం లాంటివి మద్యం వల్లే పెరుగుతున్నాయనడంలో సందేహం లేదు.
ప్రతీ సంవత్సరం మద్యం తాగుతున్న వారిలో వేలాది మం ది కాలేయ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడం వల్ల ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రతీఏటా వ్యాపారులు కొత్త వైన్స్, బార్ల టెండర్లను దక్కించుకునేందుకు ప్రభుత్వానికి వేల కోట్లు లైసెన్స్‌ల ఫీజుల రూపంలో చెల్లిస్తుండడంతో ప్రభుత్వాలు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి.
అయినా ప్రభుత్వాలు మాత్రం తమ ఆదాయం కోసం మద్యం నిషేధించే విషయంలో వెనుకడుగు వేస్తునే వస్తున్నాయి. కానీ ఆర్థిక లాభం కన్నా ప్రజల ఆరోగ్యం, సామాజిక శాంతి ముఖ్యమనేది ప్రభుత్వాలు గ్రహించాల్సిన అవసరముంది. ఇప్పటికైనా మద్య నిషేధంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు అవగాహనను పెంచాల్సిన అవసరముంది.
ప్రతాప్, హైదరాబాద్