26 June, 2026 | 9:55 PM

కీతవారిగూడెంలో ఘనంగా అయ్యప్ప స్వామి 15వ వార్షికోత్సవం

26-06-2026 08:54 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో వెలసిన శ్రీ ధర్మశాస్త్రా అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో పంచదశ (15వ) వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు కనులవిందుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

​ఉత్సవాల్లో భాగంగా ఉదయం 5:00 గంటలకు సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం దేవాలయ ముఖద్వారమునకు మేళతాళాలతో మామిడి తోరణాల అలంకరణ, గణపతి పూజ, పుణ్యాహవాచనము, మహోన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము వంటి విశేష పూజలు నిర్వహించారు. కీర్తిశేషులు వెంకటేశ్వర్లు-ప్రమీల ఇంటి వద్ద నుండి స్వామివారి పట్టు వస్త్రాలతో శోభాయమానంగా ఊరేగింపు నిర్వహించారు.

​ఉదయం 9:00 గంటల నుండి సహస్రనామార్చన, విశేష అలంకరణలు, శ్రీలక్ష్మీగణపతి, రుద్ర, మూర్తి మూలమంత్ర హోమములు, మహా పూర్ణాహుతి, అవభృతం, మహాదాశీర్వచనం  తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు స్వామివారి శోభాయమానమైన గ్రామోత్సవం, ఊరేగింపు భక్తుల జయజయధ్వానాల మధ్య కోలాహలంగా సాగింది.

ఈ పూజా కార్యక్రమాలన్నింటినీ దేవాలయ అర్చకులు బ్రహ్మశ్రీ రాయప్రోలు భద్రయ్య శర్మ, శ్రీరామయ్య శర్మ  వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ​ఈ వేడుకలకు కీతవారిగూడెం మరియు పరిసర ప్రాంతాల నుండి మహిళా భక్తులు, అయ్యప్ప స్వాములు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు దాతలు కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష సేవలందించారు.