04-02-2026 01:26:37 AM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గవ్వల భరత్ కుమార్
ముషీరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రాబోయే మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 52 శాతం బీఫాంలు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గవ్వల భరత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం విద్యానగర్ లో ఆయన మాట్లాడుతూ గత సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు జనరల్ స్థానాల్లోనే 52 శాతం విజయం సాధించారని ఆయన గుర్తు చేశారు. ఇది బీసీల రాజకీయ సామర్థ్యానికి, ప్రజాదరణకు నిదర్శనమని పేర్కొన్నారు.
అయినా ఎన్నికలు వస్తే బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో అన్ని పార్టీలు విఫలమవుతున్నా యని ఆరోపించారు. బీసీలకు బీఫాంలు కేటాయించకపోతే పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కంచిగారి ప్రవీణ్, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అభిలాష్ గౌడ్, బీసీ సంఘం గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షులు విశాల్ పటేల్, గ్రేటర్ హైదరాబాద్ బీసీ యువజన సంఘం అధ్యక్షులు సుమన్, బీసీ సంఘం మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు కాశ్యప్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.