4 September, 2026 | 7:51 PM

ముళ్లపొదల్లో పసికందు.. ఏం పాపం చేసింది

04-09-2026 | 06:46pm

దమ్మపేట, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఆ చిన్నారికి లోకం ఇంకా తెలియదు.. కానీ లోకం మాత్రం ఆ చిన్నారిని చూసి ప్రశ్నిస్తోంది. తల్లి ఒడిలో వెచ్చగా నిద్రించాల్సిన వేళ.. ముళ్లపొదల్లో ఒంటరిగా పడివున్న నవజాత శిశువు దృశ్యం పట్వారిగూడెం ప్రజల హృదయాలను కలచివేసింది. ఏ పాపం చేయని ఓ పసికందు కన్నవారి ప్రేమకు నోచుకోకముందే ముళ్లపొదల(Thorny bushes) మధ్యకు చేరిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట(Dammapeta) మండలం పట్వారిగూడెంలో తీవ్ర కలకలం రేపింది.

గురువారం రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పట్వారిగూడెం ఎస్సీ కాలనీ(SC Colony) సమీపంలోని ఓ ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్ వద్ద ఉన్న ముళ్లపొదల్లో పసికందును వదిలివెళ్లారు. రాత్రి చీకటిలో ఎవరికీ కనిపించకుండా అక్కడ వదిలివెళ్లిన ఆ శిశువు తెల్లవారేసరికి స్థానికుల కంటపడింది. ఉదయం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు ముళ్ల మధ్య కదలికలను గమనించి దగ్గరకు వెళ్లి చూడగా, ప్రాణం కోసం విలవిలలాడుతున్న నవజాత శిశువు కనిపించింది. ఈ దృశ్యం చూసిన వారు తీవ్రంగా చలించిపోయారు. వెంటనే ఆ చిన్నారిని ముళ్లపొదల నుంచి సురక్షితంగా బయటకు తీసి సమీపంలోని ఓ ఇంటికి తరలించారు. అనంతరం స్థానికుల సమాచారం మేరకు మహిళా సంక్షేమ అధికారిని హేమసత్య, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిశువు సంరక్షణకు తక్షణ చర్యలు చేపట్టారు.