బదిలీల్లో బడిబాట ఆగమాగం!
- బదిలీలు, ప్రమోషన్లపైనే టీచర్ల దృష్టి
- ఒకటో తరగతిలో 60,673 మందే చేరిక
- నామమాత్రంగానే బడిబాట కార్యక్రమం
- ప్రైవేట్ వైపే మొగ్గు చూపుతున్న తల్లిదండ్రులు
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): ఐదేళ్లు నిండిన చిన్నారులు, బడీడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తలపెట్టిన బడిబాటపై అధికారులు, టీచర్లు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది బడిబాట కాస్త టీచర్ల బదిలీల బాటగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు బడిబాట కార్యక్రమం సాగుతుంటే మరోవైపు టీచర్లకు సంబంధించిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. దీంతో బడిబాటలో చురుకుగా పాల్గొనాల్సిన ఉపాధ్యాయులు, అధికారులు తమ ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లలో తలమునకలైనారు. దీంతో ఈ విద్యాసంవత్సరానికి ఆశించిన స్థాయిలో ప్రవేశాలు నమోదు కాలేదని తెలుస్తోంది.
బదిలీలు, పదోన్నతులపైనే ఎక్కువ ఫోకస్!...
ఈ విద్యాసంవత్సరానికి ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. ఈ కార్యక్రమంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పలు కార్యక్రమాలు రూపొందించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఐదేళ్లు నిండిన పిల్లలను సమీప సర్కారు బడుల్లో చేర్పించేలా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న వసతుల గురించి తల్లిదండ్రులకు వివరించాల్సిన బాధ్యత అన్ని స్థాయిల్లోని అధికారులు, ఉపాధ్యాయులకు అప్పగించింది. అయితే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొంటే, మరికొన్ని చోట్ల మాత్రం తూతూ మంత్రంగా బడిబాట కార్యక్రమాన్ని కానిచ్చినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక టీచర్లయితే తమ బదిలీలు, పదోన్నతుల మీద పెట్టిన శ్రద్ధ బడిబాట కార్యక్రమంపై పెట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫస్ట్ క్లాస్‌లో తక్కువ అడ్మిషన్లు
ఈ సారి బడిబాట కార్యక్రమాన్ని కాస్త లేటుగా ప్రారంభించారు. గతేడాది జూన్ 3 నుంచి 17 వరకు చేపట్టగా, ఈ సారి 6 నుంచి 19 వరకు చేపట్టారు. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు మే చివరి వారం, జూన్ మొదటి వారం నుంచే తమ పిల్లల అడ్మిషన్ల కోసం స్కూళ్ల చుట్టూ తిరుగుతుంటారు. ఇలాంటి వారిని ప్రైవేట్ స్కూళ్లవైపు మళ్లకుండా వారితో మాట్లాడి సర్కారు బడుల్లో అందించే నాణ్యమైన విద్య గురించి వివరించి వారి పిల్లలను చేర్పించుకోవాలి. కానీ ఈసారి బడిబాట విజయవంతంగా నిర్వహించలేదని తెలుస్తోంది.
బడిబాట కార్యక్రమం ద్వారా అధికారిక లెక్కల ప్రకారం ఒకటో తరగతిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 వేలకుపైగా ఉన్న సర్కారు బడుల్లో కేవలం 60,673 మంది మాత్రమే పిల్లలు జాయిన్ అయ్యారు. గతేడాదిలో ఆగస్టు, సెప్టెంబర్ వరకు 1,95,820 మంది జాయిన్ అయ్యారు. ప్రతి ఏడాది బడిబాట కార్యక్రమంలో దాదాపు లక్షమంది వరకు విద్యార్థులు ఒకటో తరగతిలో చేరుతారు. కానీ ఈసారి తక్కువగా ప్రవేశాలు నమోదైనట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి పైతరగతుల్లోనూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 20,98,099 మంది విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, 11,65,748 విద్యార్థులకు నోట్ బుక్స్, 18,50,400 మంది విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు.
ప్రైవేట్‌వైపే మొగ్గు
ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం సర్కారు బడులకు దీటుగా తీర్చిదిద్దుతున్నా ఆ వైపు పిల్లల తల్లిదండ్రులు చూడటంలేదు. ప్రభుత్వ పాఠశాలలంటే అక్కడ సరిగా చదువు చెప్పరని, సౌకర్యాలు ఉండవనే భావన చాలామంది తల్లిదండ్రుల్లో ఉంది. ఈ కారణంగానే ఎంత ఫీజులున్నా తమ పిల్లలను ప్రైవేట్‌లో చదివించేందుకే ఇష్టపడుతున్నారు. దీనికి తోడూ ఉపాధ్యాయుల తీరు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సర్కారు బడి మూగబోతోంది. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం దాదాపు 80 వేలు ఖర్చు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య విద్య కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసినా సర్కారు బడుల రూపురేఖలు మార్చడం సాధ్యమయ్యేనా? అన్న ప్రశ్నలు విద్యావర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఉపాధ్యాయులు, అధికారులు సమష్టిగా కృషి చేస్తేనే సర్కారు బడి సాగుతుందని విద్యానిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.






