16 June, 2026 | 4:12 AM

బాలకృష్ణుడి కీర్తి కిరీటంలో పద్మభూషణం!

26-01-2025 12:10 AM

‘తాతమ్మ కల’ను సాకారం చేసిన మనవడిగా సినీ లోకానికి పరిచయమయ్యారు. ‘అక్బర్ సలీమ్ అనార్కలి’గా అలనాటి యువతీ యువకుల మనసు దోచేశాడు. ‘నారీ నారీ నడుమ మురారి’యై నలిగి సగటు పురుషుడికి చేరువయ్యాడు. ‘మువ్వగోపాలుడు’గా వచ్చి సినీ అభిమానుల మురిపాలు అందుకున్నాడు. ‘ముద్దుల మామయ్య’గా తెలుగింటి ఆడపడుచుల గుండెల్లో తనకంటూ ఓ స్థానాన్ని పదిలపర్చుకున్నాడు. ‘అపూర్వ సోదరుడు’గా అన్నదమ్ములతో బంధం ఏర్పర్చుకున్నాడు. ‘సాహసమే జీవితం’ అని నమ్మి ఆహార్యం, ఆంగికం, వాచకంతో నటనలో ‘దాన వీర శూర కర్ణ’ అనిపించుకున్నాడు. ‘జననీ జన్మభూమి’ కోసం ‘డాకు మహారాజ్’ వేషంలో పోరాడి, ‘అఖండ తాండవం’ చేస్తున్నాడు. మొత్తంగా ‘మంగమ్మగారి మనవడు’ శభాష్ అనిపించుకున్నారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన బాలకృష్ణుడి కీర్తి కిరీటంలో తాజాగా పద్మభూషణమూ చేరింది! 

పద్మ పురస్కారాల్లో తెలుగు చిత్ర సీమకు ప్రాధాన్యం దక్కింది. తాజాగా శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 139 మందికి పురస్కారాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. అందులో ఏడుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కళల విభాగంలో టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు బాలకృష్ణకు పద్మభూషణ్ ఇవ్వనున్నారు. 

ప్రముఖుల అభినందనలు.. 

కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించటంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను అభినందనల జల్లుల్లో ముంచెత్తుతున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులున్నారు. చంద్రబాబు, బాలకృష్ణను స్వయంగా కలిసి పుష్పగుచ్ఛంతో సత్కరించారు. బాసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవలందిస్తూ, హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేస్తూ, సినీప్రియులకు వినోదం పంచుతుండటంపై ప్రశంసలు కురిపించారు. 

50 ఏళ్ల ప్రస్థానం.. 

2024 ఆగస్టు 30 నాటికి బాలకృష్ణ తెలుగు చలనచిత్ర రంగంలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయింది. ఆ సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు స్థానికంగా ఎన్‌బీకే సినీ స్వర్ణోత్సవం నిర్వహించారు. ఆయన అభిమానుల ఆధ్వర్యంలో అమెరికాలోనూ ఈ వేడుక ఘనంగా జరిగింది. 1974లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ.. తనదైన మార్కు సినిమాలు, పాత్రలతో ఇప్పటికీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఆయన తెరపై కనిపించిన తొలిచిత్రం ‘తాతమ్మ కల’ 1974 ఆగస్టు 30న విడుదలైంది. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా కనిపించిన ఆయన తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలే ఎక్కువ. హీరో వేషాలు వేయక ముందు.. బాలకృష్ణ నటించిన ‘తాతమ్మ కల’, ‘దాన వీర శూర కర్ణ’, ‘అక్బర్ సలీమ్ అనార్కలి’, ‘శ్రీమద్విరాట పర్వము’, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’ సినిమాలకు ఎన్టీఆరే దర్శకత్వం వహించారు. ‘1984లో ‘సాహసమే జీవితం’ అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించారు. బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాల్లో ‘సాహసమే జీవితం’, ‘జననీ జన్మభూమి’, ‘మంగమ్మగారి మనవడు’, ‘అపూర్వ సోదరుడు’, ‘మువ్వగోపాలుడు’, ‘ముద్దుల మామయ్య’.. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సినిమాలుగా చెప్పవచ్చు. తెలుగులో మొట్టమొదటి సారిగా తీసిన సైపై సినిమా ‘ఆదిత్య 369’లో బాలకృష్ణ నటించిన శ్రీకృష్ణ దేవరాయ పాత్రను, ఆ కథను చాలామంది విమర్శకులు మెచ్చుకున్నారు.

రాబోయే కాలంలో జరిగే మార్పులను చాలావరకు ఆ రోజుల్లోనే ఈ సినిమాతో అంచనా వేశారని చెప్పవచ్చు. 2019వ సంవత్సరంలో ఎన్టీఆర్ బయోగ్రఫీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహా నాయకుడు’ సినిమాల్లో తన తండ్రి పాత్రను పోషించారు బాలకృష్ణ. ఇలా జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ తెలుగు అగ్ర కథానాయకుల్లో ఒకరిగా, వరుస సినిమాలతో అలరిస్తున్నారు బాలకృష్ణ. తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భారీ డైలాగులను తనదైన శైలిలో చెప్పడంలో బాలకృష్ణ ఆయనకు ఆయనే సాటి. తన తరంలో డబల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన నటుడిగానూ రికార్డు సృష్టించారు. ‘మంగమ్మగారి మనవడు’గా, ‘నారీ నారీ నడుమ మురారి’గా కెరీర్ ఆరంభంలో సాంఘిక చిత్రాలతో అదరగొట్టిన ఆయన తర్వాత తొడగొట్టి ఫ్యాక్షన్ కథలతో తెలుగు సినీ అభిమానులను అలరించారు. ‘శ్రీరామ రాజ్యం’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి పౌరాణిక గాథలతో తండ్రి ఎన్టీఆర్ తరహా కథలతో రంజింపజేశారు. ‘ఆదిత్య 369’ లాంటి సైన్స్ ఫిక్షన్ కథలు, ‘భైరవద్వీపం’ వంటి జానపద చిత్రాలతో మెప్పించారు. ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’గా వచ్చి, తానొస్తే థియేటర్లన్నీ దబిడి దిబిడే అనిపించారు!