స్మార్ట్ రేషన్ కార్డు అందుకున్న రోజే దారుణహత్య..
ఆదివారం రాత్రి గుర్తించిన స్థానికులు
బిజినేపల్లి: దేశ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసింది. మండలంలోని బోరుసుగడ్డ తండా గ్రామ పంచాయతీ ఇప్పల తండాకు చెందిన కే.చిట్టెమ్మ(50) శనివారం మధ్యాహ్నం స్మార్ట్ రేషన్ కార్డు అందుకొని అదే రోజు రాత్రి తన ఇంటిలోనే గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైంది.
ఆదివారం రాత్రి తన ఇంటి నుండి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కేతావత్ చిట్టెమ్మ లట్టుపల్లి గ్రామంలోని ఒక రైస్ మిల్లులో పని చేస్తుంది. శనివారం కందనూలులో స్మార్ట్ రేషన్ కార్డు అందుకున్న చిట్టెమ్మ తిరిగి ఇంటికి వచ్చి నిద్రించింది.
ఆదివారం సాయంత్రం స్థానికులకు ఆమె ఇంటి నుండి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా చిట్టెమ్మ ఒంటిపై తీవ్ర గాయాలతో మృతి చెంది కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చిట్టెమ్మ భర్త జుంపాలియా కూడా మూడేళ్ల క్రితం బావిలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై ఎస్సై శంషాద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






