16 June, 2026 | 2:53 AM

కానిస్టేబులన్నా నీ సేవకు సలాం

26-01-2025 01:00 AM

వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్‌కే దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మిస్తున్న ఈ సినిమాతో మధులిక వారణాసి హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం విడుదల చేశారు.

‘కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న.. కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా..’ అంటూ సాగే ఈ పాటకు శ్రీనివాస్ తేజ సాహిత్యాన్ని అందించారు. సుభాష్ ఆనంద్ సంగీత సారథ్యంలో నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ‘మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల మీద ఈ సాంగ్ రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

ప్రతీ పోలీస్ ఈ సాంగ్ వింటారు’ అని అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ‘సీపీ పాటను విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం’ అన్నారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. ‘సినిమాలో సందర్భానుసారం వచ్చే టైటిల్ సాంగ్ ఎంతో స్పందింపజేస్తుంది’ అని తెలిపారు. ‘కానిస్టేబుల్ కావాలన్న నా కల నెరవేరలేదు. ఆ టైటిల్‌తో ఈ  సినిమా నిర్మించాను. కానిస్టేబుళ్లపై గౌరవంతో నేను దగ్గరుండి రాయించి, నల్గొండ గద్దర్ నరసన్నతో పాటించాం’ అని నిర్మాత బలగం జగదీశ్ చెప్పారు.