calender_icon.png 19 February, 2026 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్క సుమన్ అరెస్టు అక్రమం: కేటీఆర్

19-02-2026 01:19:05 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు అక్రమమని, అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బడుగు బలహీన వర్గాల గొంతుకగా ఉన్న ఒక దళిత నాయకుడిని, ముందస్తు నోటీసులు లేకుండా బందిపోట్ల మాదిరిగా అరెస్టు చేయడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.

క్యాతనపల్లిలో మంత్రి వివేక్ నేరుగా ఎన్నికల ప్రక్రియను శాసిస్తూ అధికారులపై ఒత్తిడి తేవడం రాజ్యాంగ విరుద్ధమని, నిష్పక్షపాతంగా ఉండాల్సిన రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు కాంగ్రెస్ నాయకుల కళ్ల సైగలకు తలొగ్గి పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థల పతనానికి సంకేతమని హెచ్చరించారు.

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయిందని, క్యాతనపల్లిలో ప్రజలు బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, ఆ తీర్పును అపహాస్యం చేస్తూ అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, అడ్డుకున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో మా గొంతు నొక్కలేరని, నిర్బంధాలతో మా పోరాటాన్ని ఆపలేరని పేర్కొన్నారు.