3 August, 2026 | 4:36 AM

రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్‌ఎస్ కుట్ర

27-05-2024 01:53 AM

అధికారిక ఖాతా నుంచి ఎన్నికల ఇన్‌చార్జీలకు బదిలీ

బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

మెదక్, మే 26(విజయక్రాంతి): ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓట్ల కొనుగోలు చేసిన విధంగానే రాబోయే ఖమ్మం, వరంగల్, నల్లగొండ్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు డబ్బుతో ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు తెర లేపిందని బీజేపీ సీనియర్ నాయకుడు, మెదక్ ఎంపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన ఆదివారం తూప్రాన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన విధంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం బీఆర్‌ఎస్ పార్టీ తన అధికారిక అకౌంట్ కలిగిన బంజారాహిల్స్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 30మంది ఎన్నికల ఇన్‌చార్జీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు రూ.30 కోట్లను బదిలీ చేసిందని ఆరోపించారు.

ఎందుకు ఇంత డబ్బును బదిలీ చేసిందో ఎన్నికల కమిషన్ వెంటనే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. ఈ లేఖతో బీఆర్‌ఎస్ అధికారిక బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా జత చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలు ఓట్ల కొనుగోలుకు వాడుతారని, వెంటనే అకౌంట్‌లో డబ్బులను ఫ్రీజ్ చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.