ఆ వాహనాలను నిషేధించండి!
11-02-2025 12:00 AM
సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామిక ప్రాంతాల్లో ఎన్నో ఫార్మా, ఇంజినీరింగ్ సంస్థలు ఉన్నాయి. వీటిల్లో చాలామంది ఉత్తర భారత రాష్ట్రాలనుంచి వలస వచ్చిన కార్మికులు పని చేస్తూ కుటుంబాలతో జీవిస్తున్నారు. బాచుపల్లి నుంచి బొల్లారంకు వెళ్లే మార్గంలో రాకపోకల రద్దీ తీవ్రంగా ఉంటున్నది. నిత్యం భారీ, రెడీమిక్స్ వాహనాలు తిరుగుతుండడం వల్ల ఇక్కడి రోడ్లు పూర్తిగా చెడిపోయాయి.
దీంతో గుంతలు, దుమ్ము, ధూళితో వాహనదారులకు ప్రయాణం నరకంగా ఉంది. ద్విచక్ర వాహనదారులకైతే ముందు వచ్చే వాహనాలు కనబడవు. గుంతల రోడ్డులో ప్రమాదాలు జరిగే అవకాశమూ ఉంది. కనుక, పగటి వేళల్లో కాంక్రీట్ రెడీమిక్స్ వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించాలి. కేవలం రాత్రిపూట మాత్రమే వాటికి అనుమతించాలి.
ఆళవందార్ వేణు మాధవ్, హైదరాబాద్






