మోదీ పిలుపుతో మొక్క నాటిన బండి సంజయ్
‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో కార్యక్రమ నిర్వహణ
ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్న కేంద్ర మంత్రి
కరీంనగర్, జూన్ 9 (విజయక్రాంతి): ప్రధాని మోదీపిలుపుతో కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్‌లోని తన నివాసంలో అమ్మ పేరుతో మొక్క నాటారు. ప్రజా జీవితంలో మనం ఎన్నో పోరాటాలు చేస్తుంటాం. కానీ మన తల్లిపై ఎవరైనా దాడి చేస్తే, ఆ బాధ చాలా భిన్నంగా ఉంటుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇది కేవలం ఒక మొక్క కాదు. నాకు జీవితంలో అన్నీ ఇచ్చిన నా తల్లి పట్ల ఉన్న ప్రేమకు, కృతజ్ఞతకు, ఆమె నాకు ఇచ్చిన ధైర్యానికి ఇది ఒక ప్రతీక అంటూ సంజయ్ పేర్కొన్నారు.
గత నెల నాకు ఒక విషయాన్ని చాలా లోతుగా అర్థమయ్యేలా చేసింది. రాజకీయ పోరాటాలు, ఒత్తిళ్లు, ద్వేషాలు ఎంత పెరిగినా, చివరికి మన అమ్మ క్షేమంగా, ఆరోగ్యంగా మనతో ఉండటం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదని తెలుసుకున్నాను. అని పోస్టులో పేర్కొన్నారు.అమ్మకు స్ట్రోక్ రావడం నన్ను లోపల నుంచి తీవ్రంగా కలచివేసిందని,ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పిలుపు మేరకు మా ఇంట్లో ఒక మొక్క నాటుతుండగా, ఆ క్షణాలన్నీ మళ్లీ నా కళ్ల ముందుకు వచ్చాయన్నారు.






