10 July, 2026 | 12:53 PM

బంగ్లాదే టీ20 సిరీస్ విజయం

08-05-2024 01:09 AM

చట్టోగ్రామ్: సొంతగడ్డపై జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మంగళవారం జరిగిన మూడో టీ20లో బంగ్లా జట్టు జింబాబ్వేపై 9 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనప్పటికి మిడిలార్డర్‌లో తౌహిత్ హృదయ్ (38 బంతుల్లో  57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జాకర్ అలీ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తంజిద్ హసన్ (21) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ 3 వికెట్లు తీయగా.. ఫరాజ్ అక్రమ్, సికందర్ రజా చెరొక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఫరాజ్ అక్రమ్ (19 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. మరుమానీ (26 బంతుల్లో 31) పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో మహమ్మద్ సైఫుద్దీన్ 3 వికెట్లు తీయగా.. రిషద్ హొసెన్ 2, తన్వీర్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్, మహ్మదుల్లాలు తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో 3 ఆధిక్యంలో నిలిచిన బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన నాలుగో టీ20 శుక్రవారం జరగనుంది.